కార్మిక చట్టాల రద్దు కోరుతూ నల్ల బ్యాడ్జీలతో నిరసన

కార్మిక చట్టాల రద్దు కోరుతూ నల్ల బ్యాడ్జీలతో నిరసన

కేంద్ర ప్రభుత్వ ‘లేబర్ కోడ్’ విధానాలపై ఐఎఫ్‌టీయూ ఆగ్రహం
సింగరేణి సివిక్ విభాగంలో కార్మికుల ఆందోళన

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, 29 కార్మిక చట్టాలను రద్దు చేసి తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం బెల్లంపల్లిలో కార్మికులు గళమెత్తారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా సింగరేణి సివిక్ విభాగంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కార్మిక వర్గం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చడం దుర్మార్గమని మండిపడ్డారు.

ఈ ఏప్రిల్ 1 నుండి అమలులోకి తెస్తున్న ఈ లేబర్ కోడ్లు కార్మికులకు ఉరితాళ్లుగా మారతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు స్వామిభక్తి చాటుకోవడానికే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కోడ్లను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు రెడ్డి చరణ్, ఐఎఫ్‌టీయూ రీజియన్ నాయకులు ఎం. కృష్ణవేణి, గొడిసెల వెంకటి, కొమరయ్య, శ్యామ్, చంద్రకళ, పద్మ, కన్నడ దేవమ్మ, భాను ప్రకాష్, గణేష్, కరుణ, లక్ష్మి, శ్రీనివాస్, అరుణ్ తదితర కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply