పి 4 మార్గదర్శి.. బంగారు కుటుంబం కార్యక్రమానికి ఏడాది పూర్తి

పి 4 మార్గదర్శి.. బంగారు కుటుంబం కార్యక్రమానికి ఏడాది పూర్తి

నెమళ్లకుంట గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం..
కలెక్టర్ దత్తత గ్రామంలో పలు కార్యక్రమాల ప్రారంభం…
ఆర్.ఓ ప్లాంట్, సీసీ రోడ్లు, గృహాల ప్రారంభోత్సవం…
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా..

నంద్యాల బ్యూరో , ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా లోని బండిఆత్మకూరు మండలంలోని పి 4 కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి దత్తత తీసుకున్న నెమళ్లకుంట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఆర్.ఓ మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అదేవిధంగా ఐటిడిఎ సంస్థ నిర్మించిన కమ్యూనిటీ భవనం, గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన గృహాలను ప్రారంభించారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో జి.సి. పాలెం గ్రామం నుండి నెమళ్లకుంట గ్రామంలోని ఎంపీపీ పాఠశాల వరకు నిర్మించిన సీసీ రోడ్డును కూడా ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన “పి4 మార్గదర్శి – బంగారు కుటుంబం” కార్యక్రమం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం సంతోషకరమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.50 లక్షల గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని, నంద్యాల జిల్లాలో మొత్తం 1,987 గృహ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. గత ఏడాది కాలంలో ఈ నియోజకవర్గంలో సుమారు 29 కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. నెమళ్లకుంట గ్రామంలో ప్రజల అభ్యర్థన మేరకు ఆర్.ఓ ప్లాంట్, గ్యాస్ సిలిండర్లు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వంటి సౌకర్యాలు కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. త్వరలో అంగన్‌వాడీ కేంద్రం కూడా పూర్తి కానుందని పేర్కొన్నారు. గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఆరోగ్య సేవల పరంగా “మీ ఇంటికి మీ డాక్టర్” కార్యక్రమంలో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మొబైల్ హాస్పిటల్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

ఈ సేవల ద్వారా ప్రతిరోజూ సుమారు 100 కుటుంబాలకు వైద్య సేవలు అందుతాయని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, నెమళ్లకుంట గ్రామంలోని చెంచు గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం గ్రామ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. జిల్లా కలెక్టర్  నెమళ్లకుంట గ్రామాన్ని దత్తత తీసుకుని ప్రజల అవసరాలకు అనుగుణంగా మినరల్ వాటర్ ప్లాంట్, కమ్యూనిటీ హాల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని వినియోగించుకుని ప్రజలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. కేవలం ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు నిర్మించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే రు.2.35 లక్షలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రు.1 లక్ష ఇవ్వడం ద్వారా ఒక్కో ఇంటికి రు.3.35 లక్షల ఆర్థిక సాయం అందుతున్నట్లు చెప్పారు. గ్రామంలో ఇప్పటికే 26 ఇళ్లు పూర్తయ్యాయని, మిగిలిన ఇళ్లను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్ఈ నాగరాజు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply