విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడండి..

విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడండి..

  • బ్యాక్ బిల్లింగ్, సర్చార్జి మొత్తాలు మాఫీ చేయాలి..
  • రూ.38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయాలి..
  • విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు ఇవ్వండి..
  • డిప్యూటీ సీఎం, మంత్రులకు కేటీఆర్ వినతి

సిరిసిల్ల, ఆంధ్రప్రభ : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సిరిసిల్ల పవర్ లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు, సర్చార్జిల భారంపై ఆయనకు సమగ్రంగా వివరించేలా లేఖను అందజేసి, మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల పట్టణం రాష్ట్ర వస్త్ర పరిశ్రమకు గుండెకాయవంటిదని, గతంలో ఇక్కడ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన చేదు జ్ఞాపకాలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో 25 హెచ్పీ వరకు విద్యుత్ సబ్సిడీ పెంచడం వల్ల పరిశ్రమ నిలదొక్కుకుందని, అయితే ప్రస్తుతం విద్యుత్ అధికారులు విధిస్తున్న బ్యాక్ బిల్లింగ్ భారం వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడిందని వివరించారు.

2016 నుండి 2024 వరకు ఉన్న కాలానికి సంబంధించి సుమారు 127 ఎస్ఎస్ఐ యూనిట్లపై అధికారులు రూ. 19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ భారం మోపారని, అది సర్చార్జిలతో కలిపి ఇప్పుడు రూ. 38 కోట్లకు చేరిందని కేటీఆర్ ఎర్కొన్నారు. ఈ భారీ బకాయిలను చెల్లించలేక అనేక యూనిట్లు మూతపడటంతోపాటు ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులతో 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ బిల్లుల భారాన్ని మానవీయ కోణంలో రద్దు చేసి నేతన్నను అదుకోవాలన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను, కార్మికుల ఉపాధిని రక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ఉన్న బ్యాక్ బిల్లింగ్, సర్చార్జి మొత్తాలను పూర్తిగా మాఫీ చేయాలని, పాత బకాయిలతో సంబంధం లేకుండా, పరిశ్రమకు నిరంతరాయంగా విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. కార్మికులు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టకుండా తక్షణ ఆర్థిక వెసులుబాటు కల్పించాలన్నారు.

సిరిసిల్ల నేతన్నల సమస్య కేవలం ఒక ప్రాంతానిది కాదని, అది వేలాది కుటుంబాల మనుగడకు సంబంధించిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి.. త్వరితగతిన సమస్యను పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్సీ ఎల్.రమణ ఉన్నారు.

Leave a Reply