కుర్మా రావుపై సస్పెన్షన్ రద్దు…

కుర్మా రావుపై సస్పెన్షన్ రద్దు…
- తక్షణమే విధుల్లో చేరాలని జీవో జారీ
- వాస్తవాలు ప్రభుత్వానికి తెలిసేలా ప్రత్యేక శ్రద్ధ చూపిన మంత్రి అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో గ్యాస్ట్రోఎంటరైటిస్ ఘటన నేపథ్యంలో సస్పెండ్ చేయబడిన కమిషనర్ హెచ్. కుర్మా రావును తిరిగి విధుల్లోకి తీసుకురావడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు సభ్యుల కమిటీ సమగ్రంగా విచారణ జరిపి, వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణం తాగునీటి పైప్‌లైన్‌లో లీకేజీలు, పర్యావరణ సమస్యలేనని నివేదికలో స్పష్టం చేసింది.
ఈ నివేదికలను పరిశీలించిన ప్రభుత్వం, కుర్మా రావుపై విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేసి, వెంటనే అమల్లోకి వచ్చేలా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా మంగళవారం పునర్నియమించింది. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కు అప్పగించిన అదనపు బాధ్యతలను కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
ఈ నిర్ణయం తీసుకోవడంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలకంగా వ్యవహరించి, వాస్తవ పరిస్థితులను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడంలో ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు తెలిసింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల్లో సానుకూల స్పందనను పొందుతోంది.
