YSRCP | ధరల పెరుగుదలపై చంద్రబాబుపై విమర్శలు

YSRCP | ధరల పెరుగుదలపై చంద్రబాబుపై విమర్శలు

YSRCP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నియోజకవర్గాల పునర్విభజనను శుభ పరిణామంగా అభివర్ణించిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలో పెరుగుతున్న ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవాళ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అద్దంకి నియోజకవర్గ నాయకులతో సమావేశమైన ఆయన, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ అశోక్ కుమార్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

యుద్ధ పరిస్థితులను కారణంగా చూపిస్తూ నిత్యావసర వస్తువుల ధరలను అధికంగా పెంచుతున్నారని ఆయన ఆరోపించారు. వంటనూనె, పప్పుల ధరలు గణనీయంగా పెరిగాయని, గ్యాస్ సిలిండర్లను బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని విమర్శించారు. ప్రజలపై భారం పెంచే విధంగా పాలన కొనసాగుతోందన్నారు.

ఇక పరిశ్రమల ఏర్పాటులోనూ ప్రస్తుత ప్రభుత్వం క్రెడిట్ తీసుకుంటోందని జగన్ ఆరోపించారు. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, గూగుల్ ప్రాజెక్టులు తమ ప్రభుత్వ కాలంలో ప్రారంభమైనవేనని పేర్కొన్నారు. దావోస్ పర్యటనలో పెట్టుబడిదారులతో చర్చలు జరిపి ప్రాజెక్టులకు బాటలు వేసినట్లు తెలిపారు.

అలాగే బల్క్ డ్రగ్ పార్క్ విషయంలోనూ అవసరమైన భూముల సమస్యలను సృష్టించి ప్రాజెక్టును వెనక్కి నెట్టారని విమర్శించారు. తమ హయాంలో ప్రారంభించిన పోర్టు ప్రాజెక్టులు కూడా ఇప్పటికీ పురోగతి సాధించలేదని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అభివృద్ధి పనులు మందగించాయని, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పనిచేయాలని జగన్ సూచించారు.

Leave a Reply