25marchdevotional | ఆంధ్రప్రభలో నేటి చింతన

25marchdevotional | ఆంధ్రప్రభలో నేటి చింతన
25marchdevotional | గ్రామ దేవతల ఆవిర్భావం, ప్రాముఖ్యత
పంచభూతాల ఆధారంగా దేవతల రూపాలు
జాతరల వైభవం మరియు ప్రాంతీయ విశేషాలు
పోతురాజు పాత్ర, ఆచారాలు
ఉగాది ముందు నుంచి, కొన్ని రోజుల వరకు చాలా ప్రదేశాలలో గ్రామదేవతల పేరుతో ఉత్సవాలు నిర్వహించడం. ఆనవాయితీ. కుటుంబ సంక్షేమం కోసం, నివాస ప్రాంతం, గ్రామ క్షేమం కోసం దేవతలను, ముఖ్యంగా అమ్మ వారి రూపాలను ఆరాధిస్తూ ఉంటారు. ఈ ప్రకృతిలో సృష్టికి మూల బిందువు మూలపుటమ్మ, పెద్దమ్మ, ఆవిడే జగన్మాత. చాలా శతాబ్దాల నుంచి “గ్రామ దేవతల ఉనికి” ఉంది. ఒక్కో గ్రామదేవతకు ఒక్కో చరిత్ర ఉంది. వాస్తవానికి గ్రామదేవతల ఆవిర్భావం గురించి ఎక్కడా సరైన సమాచారం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయదారులు, కూలీలు తమ పంటను ఒక రాశిగా పోసి, ఒక రాయినో, ఒక చెట్టు మొదట్లోనో దేవతా స్వరూపంగా భావిస్తూ ముందుగా, ఆ దేవతకు సమర్పించేవారు. వారు ఆ సందర్భంలో ఆ దేవతలకు నూకాలమ్మ అనో, గంగాలమ్మ అని పేరు పెట్టి సమర్పించే వారు.
కాలక్రమేణా సృష్టిలోని పంచభూతాల ఆధారంగా గ్రామదేవతల పేర్లు వాడుకలోకి వచ్చాయి. పృథ్వి ఆధారంగా పంటలు పండుతాయి. అందుకని నూకాలమ్మ, (మాకలు అంటే ధాన్యం), కుంకుళ్ళమ్మ, జొన్నాళ్ళమ్మ, అన్నమ్మ వంటి పేర్లు ఉనికిలోకి వచ్చాయి. జలం ఆధారంగా గంగాలమ్మ, జలమ్మ వంటివి, వాయువు చిహ్నంగా కురువలమ్మ (కురువ అంటే పెద్ద గాలి) అగ్ని చిహ్నంగా సూరమ్మ, పున్నమ్మ, మంటాలమ్మ వంటివి, ఇక ఆకాశం గుర్తుగా కొండమ్మ, ఆశమ్మ వంటి పేర్లు వాడుకలోకి వచ్చాయి. మొదట్లో గ్రామ దేవతలు వేపచెట్టు క్రిందనో, రావి చెట్టు మొదట్లోనో గరగలు లేదా ఒక రాట ఏర్పాటు చేసి, గ్రామంలోని ప్రజలు సురక్షితంగా, ఆరోగ్యంగా, ఉండాలని, పాడిపంటలకు లోటు లేకుండా ఉండాలని ఆరాధన చేసేవారు. జంతు బలులు, ఇచ్చేవారు. వివిధ అంచనాల ప్రకారం దాదాపు 101 వివిధ నామాలతోనూ గ్రామ దేవతలను ఆరాధిస్తున్నారు.
ప్రతీ 12 సం.రాలకో, 15 సం.రాలకో జాతర మహోత్సవాలు పేరుతో వైభవంగా నిర్వహిస్తారు. ప్రారంభంలో గ్రామ పొలిమేరలలో గ్రామదేవతల ఆలయాలు ఉండేవి. కాలక్రమేణా గ్రామంలోని ముఖ్య కూడలిలో ఏర్పాటు చేస్తున్నారు. విజయనగరంలోని పైడితల్లి అమ్మవారు, సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ, కాకినాడ నూకాలమ్మ, ఏలూరు దగ్గర ఉన్న రాట్నాలకుంటలో రాట్నాలమ్మ, విశాఖలో కనకమహా లక్ష్మీ, భీమవరం మావుళ్ళమ్మ ఇలా ప్రతి గ్రామంలోనూ గ్రామదేవతలు ప్రసిద్ధి పొందారు. తెలంగాణాలో బోనాలు పేరుతోను, సమ్మక్క-సారక్కలో గిరిజన దేవతలు ఉత్సవాలు పేరుపొందినవి. ప్రస్తుతం చాలా చోట్ల గ్రామదేవతల సంబరాలు, జాతరలు జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెంలోని బలుసులమ్మ అమ్మవారికి 12 సం.రాల తరువాత ఘనంగా ఉత్సవాలు జాతరలు జరుగుతున్నాయి.

తణుకు దగ్గరలోని రేలంగి గ్రామంలో ఉన్న మంటలాంబ ఉత్సవాలు, జాతరలు కూడా ఈ నెలలో జరుగుతాయి. ఈ గ్రామ దేవతల గురించి మార్కండేయ పురాణంలో కొంత వరకు వివరించబడింది. గ్రామదేవతల రక్షణకై వారి సోదరుడు పోతురాజు గుడి కూడా ఉంటుంది. గ్రామ దేవతల ఉత్సవాలలో పోతురాజును కూడా గౌరవించి, ఆరాధన చేస్తారు. గ్రామ దేవతల ఉత్సవాలు కాలంలో, ఆ ప్రదేశంలోని ప్రతీ ఇంటా అమ్మవారికి నైవేద్యం సమర్పించవలసి ఉంటుంది. దేవీ భాగవతంలో కూడా గ్రామ దేవతల ప్రస్థావన ఉంది. పూర్వం అమ్మ దేవాలయాలు మధుర, కంచి, కాశీ విశాలాక్షి వంటి దేవతల దర్శనం కోసం చాలా వ్యయ ప్రయాసలు పడవలసి వచ్చేది. అంతదూరం వెళ్ళలేక, అమ్మ, వారినే గ్రామంలో కొలువు తీరిస్తే సమస్య ఉండవు కదా! అని కూడా గ్రామ దేవతల ప్రాభవం పెరగడానికి కారణం.
అనంతాత్మకుల రంగారావు
