ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు…

ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు…

అక్రమ పార్కింగ్, రహదారి ఆక్రమణలపై కఠిన నిర్ణయాలు.

కర్నూలు, ఆంధ్రప్రభ : నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు పోలీసులు, మునిసిపల్ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, డీఎస్పీ జె. బాబు ప్రసాద్ పర్యవేక్షణలో ట్రాఫిక్ సీఐ మన్సరుద్దీన్ ఆధ్వర్యంలో ఈ చర్యలు అమలు చేశారు. నగరంలోని రద్దీ ప్రాంతాలైన కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వరకు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు విస్తృతంగా చర్యలు తీసుకున్నారు.

వాహనదారులు, పాదచారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రహదారులపై ఏర్పడిన అడ్డంకులను తొలగించారు. ఈ సందర్భంగా రహదారులను ఆక్రమించిన తోపుడు బండ్లు, అనధికారిక పార్కింగ్‌లు, ఇతర అడ్డంకులను తొలగించారు. ట్రాఫిక్ సాఫీగా సాగేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో ప్రజలు, వ్యాపారవేత్తలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. రహదారులపై వాహనాలను అడ్డంగా నిలపకుండా ఉండాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సీఐ మన్సరుద్దీన్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఆర్‌ఎస్‌ఐలు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply