ప్రజలతో కలిసి భోజనం… సేవలపై నేరుగా సమీక్ష

ప్రజలతో కలిసి భోజనం… సేవలపై నేరుగా సమీక్ష

అన్న క్యాంటీన్‌లో కలెక్టర్ లక్ష్మీశ పరిశీలన
విద్యాధరపురంలో ఆకస్మిక తనిఖీ
భోజన నాణ్యతపై ప్రత్యక్ష పరీక్ష
ప్రజాభిప్రాయాలకు క్యూ ఆర్ కోడ్ సదుపాయం

విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సేవల పట్ల తన నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. అన్న క్యాంటీన్‌లలో ఆహార నాణ్యత, నిర్వహణపై ప్రత్యక్ష అవగాహన కోసం ఆయన స్వయంగా ప్రజలతో కలిసి భోజనం చేయడం విశేషంగా నిలిచింది. శనివారం రాత్రి విద్యాధరపురం అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, ముందుగా అక్కడ అందిస్తున్న భోజనాన్ని స్వయంగా తీసుకుని రుచి చూశారు. అనంతరం క్యాంటీన్‌లోని పరిశుభ్రత, మౌలిక వసతులు, నిర్వహణ విధానాలను సమగ్రంగా పరిశీలించారు. భోజనం చేస్తున్న ప్రజలతో నేరుగా మాట్లాడిన ఆయన, సేవలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.


ప్రజల అభిప్రాయాలను సులభంగా సేకరించేందుకు క్యూ ఆర్ కోడ్ సదుపాయం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. దీని ద్వారా ఎవరైనా తమ సూచనలు, ఫిర్యాదులు నేరుగా అధికారులకు తెలియజేయవచ్చని చెప్పారు. అన్న క్యాంటీన్‌ల ద్వారా ప్రజలకు నాణ్యమైన, తక్కువ ధరలో ఆహారం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. సేవల మెరుగుదలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. ప్రజల అవసరాలను ప్రత్యక్షంగా అర్థం చేసుకుని సేవల ప్రమాణాలను పెంచే దిశగా చేపట్టిన ఈ పరిశీలన స్థానికంగా చర్చనీయాంశమైంది.