22MarSunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

22MarSunday2026|ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం Sunday Magazine లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ/శీర్షిక ఆంధ్రప్ర‌భ‌ Sunday Magazine పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు.. 
– అసోసియేట్ ఎడిటర్, ప్రభన్యూస్.కాం.

22MarSunday2026 |ఈ సంచికలో…

1. నయనం ప్రధానం..కంటి ఆరోగ్యంపై చిన్నచూపొద్దు. (ముఖచిత్ర కథనం)

2. కబుర్లు (శీర్షిక)

3. సన్నిహితం(శీర్షిక)

4. ఆలోచనా శ్రీనివాసం (శీర్షిక)

5. వినరో భాగ్యము వైకుంఠ వైభవము(శీర్షిక)

_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-

నయనం ప్రధానం..కంటి ఆరోగ్యంపై చిన్నచూపొద్దు.

22MarSunday2026 | స్క్రీన్‌ల ప్రభావం కంటి ఆరోగ్యంపై
పిల్లల్లో పెరుగుతున్న కంటి సమస్యలు
కంటి ఆరోగ్యానికి అవసరమైన జాగ్రత్తలు

నయనం.. ప్రధానం
ఆధునిక జీవనశైలిలో కంటి ఆరోగ్యంపై పెరుగుతున్న ముప్పు

శ్రీ సత్యసాయి బ్యూరో: మనిషి శరీరంలో అత్యంత విలువైన అవయవాల్లో కళ్ళు ఒకటి. ప్రపంచాన్ని చూడటానికి, అనుభూతి చెందటానికి కళ్ళే ప్రధాన ద్వారం. అలాంటి కంటి ఆరోగ్యం ప్రస్తుతం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. “నయనం.. ప్రధానం” అనే అంశం ఈ నేపథ్యంలో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. చదువు, ఉద్యోగం, వినోదం—అన్నీ స్క్రీన్‌ల చుట్టూనే తిరుగుతున్నాయి. ఫలితంగా కళ్ళపై ఒత్తిడి అధికమవుతోంది.

చాలా మంది రోజుకు 6–10 గంటల వరకు స్క్రీన్ ముందు గడుపుతున్నారు. దీనివల్ల:
కంటి అలసట, కంటి ఎండిపోవడం,
తలనొప్పి, చూపు మందగించడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి.

22MarSunday2026
22MarSunday2026

ఇటీవలి కాలంలో చిన్నపిల్లల్లో కూడా కంటి సమస్యలు అధికమవుతున్నాయి.
ఆన్‌లైన్ క్లాసులు, గేమ్స్, మొబైల్ వినియోగం కారణంగా చిన్న వయసులోనే కళ్ళద్దాలు అవసరం అవుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇది వారి చదువు, ఆత్మవిశ్వాసంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఎ, ఐరన్ వంటి పోషకాలు తగినంతగా అందకపోవడం కూడా ప్రధాన కారణం.
పచ్చి కూరగాయలు, క్యారెట్, ఆకుకూరలు తక్కువగా తీసుకోవడం వల్ల కంటి సమస్యలు పెరుగుతున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపం…
పట్టణాల్లో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది.
కంటి పరీక్షలపై అవగాహన తక్కువగా ఉండటం, సమీపంలో వైద్యులు లేకపోవడం వల్ల సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి.

దేశవ్యాప్తంగా కంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. పిల్లలు, యువతలో చూపు తగ్గుదల అధికమవుతోంది.
సమయానికి పరీక్షలు చేయించుకోకపోతే చిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యలుగా మారుతున్నాయి.

కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని సాధారణ అలవాట్లు ఎంతో ఉపయోగకరం:
ప్రతి 20 నిమిషాలకు కళ్ళకు విశ్రాంతి ఇవ్వాలి. (20-20-20 నియమం)
సరైన వెలుతురులోనే చదవాలి. స్క్రీన్ టైమ్ తగ్గించాలి. పోషకాహారం తీసుకోవాలి.
ఏడాదికి కనీసం ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవాలి.

కంటి ఆరోగ్యం కేవలం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు, సామాజిక బాధ్యత కూడా. పాఠశాల స్థాయిలో కంటి పరీక్షలు నిర్వహించడం, గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఐ క్లినిక్స్ ఏర్పాటు చేయడం, అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అత్యవసరం.

22MarSunday2026
22MarSunday2026

“నయనం.. ప్రధానం” అనే అంశం మనందరికీ ఒక హెచ్చరికలా నిలుస్తోంది. మారుతున్న జీవనశైలిలో కంటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకుని కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.

  • నాగరాజు, శివమ్మ లకు మొదటి సంతానం మగ పిల్లవాడు. వాడికి మూడేళ్లు పూర్తి కూడా కాకనే రెండవ సంతానంగా పాప పుట్టింది. మూడేళ్ల లోపు బాలుడికి పాలు తాపించాలన్న, భోజనం తినిపించాలన్న బాగా సతాయించేవాడు. ఈ క్రమంలో సెల్ ఫోన్ లో వీడియోలు, బొమ్మలు చూపించి పాలు తాగించడం, భోజనం తినిపించడం వంటివి చేశారు. అదే అలవాటుగా మారిపోయింది. ఇక అప్పటినుంచి సెల్లు చూపిస్తే కానీ తినడు, తాగడు. రెండో సంతానాన్ని చూసుకోవాలంటే పిల్లాడు సైలెంట్ గా ఉండాలి. వాడు సైలెంట్ గా ఉండాలంటే సెల్లు చేతిలో ఉండాలి. చేసేది లేక సెల్లు ఇచ్చారు. ఇక అదే అలవాటు సెల్లు చేతిలో లేనిదే వాళ్లు చెప్పే మాట వినడు.

ప్రస్తుతం ఆ దంపతులకు పిల్లాడికి సెల్లు ఇవ్వడం తప్ప మరొక మార్గం కనిపించలేదు. దీంతో ఆ పిల్లోడు సెల్లుకు బాగా బానిసగా మారిపోయాడు. ఆ ఒక్క బాలుడే కాదు ప్రస్తుతం సమాజంలో వందకు 99 శాతం మంది పిల్లలు సెల్లులు వల్ల బాల్య దశ నుంచే రేడియేషన్‌కు గురవుతూ వస్తున్నారు. ఫలితంగా ముందుగా కళ్ళకు ఆ ప్రభావం పడుతుంది. ఈ కారణంగా పదేళ్ల లోపే భూతద్దం లాంటి కళ్ళజోళ్ళు అవసరం అవుతున్నాయి.

సాధారణంగా సెల్ఫోన్ ను ఎక్కువ చూసే పిల్లల్లో హ్రష్య దృష్టిలోపం (మయోసియా) వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా తల మెడ వెన్నెముక లకు సమస్యలు తలెత్తి ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితులు పెరిగిపోతాయి.

ముఖ్యంగా రెండు నుంచి ఐదేళ్ల పిల్లోళ్లలోపు వారు రోజుకు ఒక గంటకు మించకుండా, వారాంతపు రోజుల్లో రెండున్నర నుంచి మూడు గంటల లోపు వరకు పరిమితం చేయాలి. లేని విషయంలో జబ్బులు కొని తెచ్చుకోవాల్సిందే. కాగా సాధ్యమైనంత వరకు పిల్లలకు సెల్లు చూసే అవకాశం ఇవ్వకుండా కథలు చెప్పడం, వీలుంటే సమీప పార్కులకు, పొలాల వద్దకు తీసుకెళ్లడం ఆరోగ్యకరం.

-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

2 కబుర్లు (శీర్షిక)

DEC 2025

గెలుపు గుర్రం

అనగనగా ఒక రాజ్యంలో గొప్ప గుర్రపు పందెం జరగబోతోంది. ఆ పందెంలో గెలిచిన గుర్రానికి, దాని యజమానికి భారీ బహుమతులు ప్రకటిస్తారు. ఆ రాజ్యంలోని ఒక పేద కుర్రాడి దగ్గర ఒక గుర్రం ఉండేది. అది చాలా వేగంగా పరిగెత్తగలదు, కానీ ఒక చిన్న సమస్య. చుట్టుపక్కల కొద్దిపాటి శబ్దం వినిపించినా, పరుగెత్తే గుర్రాలు పక్కన కనిపించినా పక్కదారి పట్టి ఆగిపోయేది.

పందెం మరికొద్ది రోజుల్లో ఉందనగా ఆ కుర్రాడు ఒక అశ్వశిక్షకుడి దగ్గరకు వెళ్లి తన బాధ చెప్పుకున్నాడు. అప్పుడు ఆ శిక్షకుడు నవ్వి ఇలా అన్నాడు:

“పందెంలో గెలిచే గుర్రం ఎప్పుడూ తన పక్కన ఉన్న గుర్రాలు ఎంత వేగంగా పరిగెత్తుతున్నాయో చూడదు. అది కేవలం తన లక్ష్యం (Finish Line) వైపు మాత్రమే చూస్తుంది. నీ గుర్రం కళ్ళకు, చెవులకు గంతలు కట్టు, అవి పక్కన ఉన్నవాటిని చూడకుండా కేవలం ముందరి దారిని మాత్రమే చూపిస్తాయి. చప్పుళ్ళేవీ చెవికి వినపడవు.”

ఆ కుర్రాడు అలాగే చేశాడు. పందెం రోజున ఆ గుర్రం చుట్టుపక్కల అరుపులను, మిగిలిన గుర్రాలను పట్టించుకోకుండా కేవలం తన ముందున్న దారిని మాత్రమే చూస్తూ పరిగెత్తి అందరికంటే ముందు నిలిచింది. విజయం సాధించింది.

22MarSunday2026
22MarSunday2026

విద్యార్ధులకు పరీక్షలు కూడా గుర్రపు పందేలు వంటివే! పరీక్షకు సిద్ధం అవుతున్న సమయంలో తోటివారితో పోలిక వద్దు. ఎవరు ఎంత చదివారు, వాడు ఎన్ని గంటలు మేల్కొంటున్నారు అనేది తనకు అనవసరం. దృష్టి కేవలం సిలబస్, ప్రిపరేషన్ మీద మాత్రమే ఉండాలి. ఫోన్, సోషల్ మీడియా, సినిమాలు, గాసిప్స్ గుర్రానికి అడ్డు వచ్చే శబ్దాల వంటివి. పరీక్షలు పూర్తయ్యే వరకు వాటికి ‘గంతలు’ కట్టేయాలి … అంటే దూరంగా ఉండాలి

ఫలితం గురించి భయం వద్దు! గుర్రం పరుగెత్తేటప్పుడు బహుమతి గురించి ఆలోచించదు కదా! కేవలం ఆ క్షణంలో పరుగు మీద మాత్రమే దృష్టి పెడుతుంది. విద్యార్థీ మార్కుల గురించి కాకుండా, చదువుతున్న అంశాన్ని అర్థం చేసు కోవడం మీద దృష్టి పెట్టాలి.

ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయడమే ముఖ్యం . ఎవరికి వారే అసలైన పోటీ! విద్యార్థి శ్రద్ధ పెడితే మంచి ఫలితం తప్పక వస్తుంది.


———————————————————————-


3.సన్నిహితం… శీర్షిక

DEC 2025

ఐడెంటిటీ క్రైసిస్

ఆఫీసులో పనిచేసుకుంటూ ఉండగా వచ్చాడు రాకేష్. స్వీట్ బాక్స్ నా ముందు పెట్టీ ” స్వీట్ తీసుకోండి సార్..కొత్త కార్ కొన్నాను ” అని చెప్పాడు.
” కంగ్రాచులేషన్స్ ” అని చెప్పి ఒక స్వీట్ తీసుకున్నాను.సంతోషంగా వెళ్ళిపోయాడు రాకేష్ . బయటకు వచ్చి చూస్తే పొడుగ్గా ఉన్న స్విఫ్ట్ డిజైర్ కారు ఉంది.చాలా లో లెవెల్ ఎంప్లాయ్ అతను.ఈ మధ్యనే ప్రమోషన్ వచ్చింది.అందుకే కారు కొన్నాడు.
ఆ తర్వాత లంచ్ టైంలో నా పాత మారుతి కారులో లంచ్ కి ఇంటికి వెళ్ళాను. ఎప్పుడో పదేళ్ల క్రితం కొన్న కారు. చాలా సార్లు రిపేర్ చేయిస్తూ వాడుతున్నాను. కొత్త కారు
కొనడం నాకు పెద్ద సమస్య కాదు కానీ ఈ కారు బాగానే ఉంది కదా అన్న ఫీలింగ్ తో ఆ కారునే వాడుతున్నాను.
ఇంటికి వెళ్ళి లంచ్ తింటూ నా భార్యతో రాకేష్ కొత్త కారు కొన్న విషయం చెప్పాను. అగ్గి మీద గుగ్గిలం అయింది నా భార్య.
” సిగ్గు లేదా నీకు…నీకంటే స్థాయిలో ఎంతో దిగువన ఉన్న అతను చిన్న ప్రమోషన్ రాగానే కొత్త కారు కొన్నాడు.నువ్వు మాత్రం మమ్మల్ని ఈ డొక్కు కారులో తిప్పుతున్నావు ” అని తిట్టసాగింది. ఇక అన్నం తినలేక లేచి ఆఫీసుకు వచ్చేశాను.
నాలో ఆత్మ విమర్శ మొదలైంది. సమాజంలో నా స్థాయి గొప్పదే అయినా ఎందుకో నాకు డాబు కొట్టడం అలవడ లేదు.

కానీ నా చుట్టూ ఉన్న చిన్న చిన్న వాళ్ళు కూడా తమ హోదాని , స్థాయిని ప్రదర్శించాలి అని తాపత్రయ పడుతూ ఉంటారు.ఇదేమీ తప్పు కాదు కానీ ఎందుకో నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ? అని ఆలోచిస్తే నాకు దొరికిన సమాధానం ఏంటంటే నా స్థాయి ని ఈ సమాజం ఆటోమేటిగ్గా గుర్తిస్తుంది. నాకు ఐడెంటిటీ ఆటోమేటిగ్గా వస్తుంది.కానీ చిన్న చిన్న వాళ్ళను ఈ సమాజం పట్టించుకోదు. అందుకే వాళ్ళు మేము ఎదుగుతున్నాం , మమ్మల్ని గుర్తించండి అని ‘ ప్రదర్శన ‘ కు దిగుతారు.డెవలప్మెంట్ చూపిస్తారు.ఇదే కదా ఐడెంటిటీ క్రైసిస్ అంటే.ఇది తప్పు ఏమీ కాదు.
సోషల్ మీడియాలో పెద్ద పెద్ద రచయితలు కళాకారులు హడావుడి ఏమీ చెయ్యరు. నిశ్శబ్దంగా తమ వర్క్ తాము చేసుకుంటారు.కానీ నా లాంటి చిన్న రచయితలు / కళాకారులు ప్రతీ చిన్న విషయానికి హడావుడి చేస్తుంటారు.ఐడెంటిటీ క్రైసిస్ తో ‘ ప్రదర్శన’ కు దిగుతారు. అందుకే లిటరరీ ఫీల్డ్ లో నాకు , ఆఫీసులో ఆ చిన్న ఎంప్లాయ్ కి పెద్ద తేడా లేదు కదా ఫ్రెండ్స్ !!!!

====================================

4. ఆలోచనా శ్రీనివాసం (శీర్షిక)

ప్రపంచ నాటక రంగ దినోత్సవం!

సంస్కారం, శాంతి, సహనం రంగస్థలం ద్వారా పరివ్యాపితమవుతాయి!

సంస్కృతి ద్వారా శాంతి ప్రవహించాలి! అది రంగస్థలం ద్వారా ప్రతిబింబించాలి! Theatre and a culture of Peace ఈ సంవత్సరం మెసేజ్ ఇది!
నాటకం సమాహార కళ. మార్చి 27ను ప్రపంచ నాటక రంగ దినోత్సవం!

1962(27-03-1962)నుంచి World Theatre Day జరుపుకుంటున్నాము! ITI, International Theatre Institute, World organisation for the Performing Arts ద్వారా! పారిస్ లో మొదటి మెసేజ్ Jean Coateau రాశాడు!

ఈ సంవత్సరం మెసేజ్ Willem DAFOE, USA, Actor, Theatre Maker ఇచ్చాడు. దీనిని మీరు నెట్ లో చదువుకోవచ్చు.

నాటకం ఒక గొప్ప ప్రత్యక్ష అనుభవం! నిఘంటువు ప్రకారం, నాటకం అనేది శ్రవణ సహిత దృశ్య రూపకం! జానపద కళలు విలసిల్లుతున్న దినాలలో సంస్థానాలు, రాజుల పరిపాలన, ఆ కాలంలో ప్రజల ఆనందం కోసం, రాజుల సంతోషం కోసం విరివిగా ప్రదర్శించబడిన, ఆదరించ బడిన కళ నాటకం! పాటలు, సంగీతం, నృత్యాలతో కూడుకున్న ప్రక్రియ నాటకం! భరతుడి నాట్యశాస్త్రం, నందికేశుడు అభినయ దర్పణం …మొదలైన వాటి ద్వారా నాటకం శాస్త్రీయతను సంతరించుకుంది! పదవ శతాబ్దంలో ధనంజయ మహర్షి దశరుపకాలు రాశాడు! ఆదారం భరతముని నాట్య శాస్త్రమే అయిన మరింత విస్తృతంగా, స్పష్టంగా వివరణ పెరిగింది! నాట్య శాస్త్రం ఒక అద్భుతం!

ఇక నేటి వర్తమాన కాలంలోకి వద్దాం! ఎందుకు నాటకం, ఈ Digital Media యుగంలో, సోషల్ మీడియాలో మంచి, చెడ్డ కలిసి నడుస్తున్నాయి! ఒక్కసారి చెత్తను కూడా వేల కోట్ల మంది చుస్తునారు!

This life is not man’s own show; if he becomes personally and emotionally involved in the very complicated COSMIC drama, he reaps inevitable suffering for having distorted the divine plot.

Real life is messy, drama is shaped version of real life. Drama is life with the dull bits cut out. Drama is very important in life : You have to come on with a bang. You never want to go out with a whimper.

నిజమైన నాటక కళలో ప్రత్యక్షంగా, లేదా పరోక్షంగా పాల్గొనడం ద్వారా ఎన్నో గొప్ప ఫలితాలు మనుషులకు, సమాజానికి కలుగుతాయి అని శాస్త్రీయంగా నిరూపించ బడింది!

ఉగాది వెళ్ళి నాలుగు రోజుల అయ్యింది! ప్రపంచ నాటక రంగ దినోత్సవం రోజునే శ్రీరామ నవమి! శ్రీరామ జయరామ జయ జయ రామ! నమ్మకాల వంతనను లౌకికత్వం ముసుగుతో పడగొట్ట వొద్దు! ఒకరిని ముద్దు చేస్తూ…, మెజారిటీ ప్రజలను అగౌరవ పరచవొద్దు! కల్పవృక్షం, విషవృక్షం … రెండిటినీ మన ప్రజల చూశారు! విజ్ఞత, సంస్కారం ప్రదర్శించారు! ఒక్కోసారి సహనం చేతగాని తనంగా కనిపిస్తుంది! యో యో యాం యాం శ్రద్ధ యార్చితి మిర్చితి: …సరే, ఎవరి సాధన వారు చేసుకోవచ్చు! కానీ మా దేవుడే దేవుడు, మీ దేవుడు సైతాను, దెయ్యం, భూతం, మీరు కాఫిర్ లోగ్ అంటేనే…, Non-sense! మానవ జాతిని నాశనం చేసే భయంకర యుద్ధాలకు దారి తీసే ఆలోచనలు అవి! మా దేవుడు నిజమైన సజీవమైన దేవుడు…., నిజమైన దేవా… అని, ఇంకో మతం దేవుడు అబద్దం, సైతాను అనడం…. ఎంత తప్పు, బూతు! నమ్మకం, మూఢ నమ్మకం, జ్ఞానం, అజ్ఞానం… అణుబాంబులతో యుద్ధం చేసుకుని, ఈ భూమిని సర్వ నాశనం చేసుకునే రోజులు ఎంతో దూరంలో లేవు!

ఈ మహా ప్రమాదం నుంచి కాపాడేది నాటకం మాత్రమే! Theatre is a saviour, and a vehicle for transformation!

” All the world’s a stage, and all the men and women are merely players ” William Shakespeare అన్నాడు!
‘The world’s a stage, But the play is badly cast’ – Oscar Wilde మరో రకంగా అన్నాడు, అంతరార్థం పొడిగించి!

కావ్యేషు నాటకం రమ్యం – మన వాళ్ళు! కాళిదాసు శాకుంతలం ఎంతో గొప్పది అన్నారు!

వీధి నాటకాలు, కూచిపూడి భాగవతులు, యక్ష గానాలు, జానపద నాటకాలు…., ఉత్తరాదిన రామ్ లీలా, తమిళ తెరికుత్తు(ఇది కూడా వీధి నాటకమే), తోలుబొమ్మలాటలు, పద్య నాటకాలు…ఎంతో ప్రయాణం!

తర్వాత ఇక్కడ మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్పారావుగారు సాంఘిక నాటకాలు వైపు అడుగులు వేస్తే, 1860 లో కోరాడ రామ చంద్ర శాస్త్రిగారు రాసిన మంజరీ మధుకరీయం మొదటి మన నాటకం అన్నారు! ప్రదర్శన పరంగా గురజాడ కన్యాశుల్కం అద్భుతాలు చేసింది! ధర్మవరం రామకృష్ణా చార్యులు, నటుడిగా బళ్ళారి రాఘవ చరిత సృష్టి చేశారు!
తర్వాత పద్య నాటకాల చరిత్ర, ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు…., కాంట్రాక్టర్లు..!

సాంఘిక నాటకాల్లో పనివాడు రంగయ్య పాత్ర ప్రవేశం, పరిషత్తు నాటకాలు, నాటక సమాజాలు వచ్చాయి!

కళ కళ కోసమా? కళ సమాజం కోసమా? ఈ ప్రశ్నను దాదాపు అందరూ మరిచిపోయారు! పరిషత్తులో మొదటి బహుమతి ముఖ్యం! దాని కోసం లాబీయింగులు, నాటక సరదాలు, …, కొన్ని చీకటి పనులు! మందు, చిందు, వినోదం, లాబీయింగ్ బ్యాచులు బయలు దేరారు! గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుని రిటైర్ అయ్యి, పెన్షన్ డబ్బు అనుభవిస్తూ… కడుపులో చల్ల కదలకుండా, ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలని వారు పరిషత్తు జడ్జీలుగా కూర్చుంటున్నారు! ఇంకా వేరే పనీ పాట లేక….,(ఎక్కువ మంది ఇలా ఉన్నారు అని మనకు తెలుసు. ఒకరిద్దరు exceptions అంతే) వానప్రస్థంలో వారికి ఇదో గొప్ప వ్యాపకం వారికి! South zone, North zone, West zone, East Zone Youth festivals కూడా వీరే! అన్ని జీవిత సాఫల్య బహుమతులు కూడా వీరికే!

ఇంకా కొన్ని పరిషత్తులు కులాల వారీగా విడిపోయాయి, మన తెలుగు రాష్ట్రాలలో! కమ్మ వారి కనుసన్నల్లో నడిచే కొన్ని పరిషత్తులు(కృష్ణా, గుంటూరు, తెనాలి ప్రాంతాల్లో), బ్రాహ్మల కనుసన్నల్లో నడిచే పరిషత్తులు కొన్ని, అలాగే కాపుల కోసం కొన్ని! వీటి వెనుక కొందరు పెద్దలు! ప్రభుత్వాలతో కూడా వీళ్లే మాట్లాడతారు! ఎందుకంటే ఎన్నికల సమయాల్లో కాన్వాసింగ్ కోసం వీరు ఏదో చేసి ఉంటారు! ఇక ప్రభుత్వం కూడా వీరే మొత్తం తెలుగు నాటకానికి యుగ కర్తలు అనుకుంటారు! అసలైన, నిజమైన కళాకారులకు ఎంతో అన్యాయం జరుగుతోంది!

ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజు మొహమాటం లేకుండా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం! అన్నీ ఒక వరుసలో చెప్పుకోలేము! మ్యూజింగ్స్ పాటర్న్ లో చూద్దాం!

తెలుగు పరిషత్తు నాటకాలు గురించి…కొంత చూద్దాం, బాధ పడవద్దు…, నిజాలు చేదుగా ఉంటాయి!

తెలుగు పరిషత్ నాటకాల్లోని…

కథల్లో- తప్పించుకోలేని విషాదం, కన్నీటి వర్షంలో ముంచే పేదరికం, దరిద్రం చుట్టూనే సన్నివేశాలు, ఘటనలు, ఇంకా తిరుగుతున్నాయి.

ఛీ, మనం ఇలాంటి మనుషులమా అని మనల్ని మనం అసహ్యించుకోవాలి. లేని దుర్మార్గం ఉందని ఊహించుకుని మనల్ని మనం ద్వేషించుకోవాలి. ఆ సందేశాలు, సూక్తులు విని తరించాలి. ప్రక్షాళన కలిగించారని భ్రమించాలి.

వంట రుచి చూసే వాడికి, వంట చెయ్యడం తెలియాల్సిన అవసరం లేదు. అగ్గి పెట్టె, స్టవ్, వండిన వంట గిన్నెలు ఎలా తోమాలో తెలియక పోయినా, వండిన భోజనం ఎలా ఉందో చెప్పగలడు. Judgement చేయగలడు. సద్విమర్శ లో కూడా కరకుతనం ఉంటుంది. ఔన్నత్యంతో అందులో తప్పు గ్రహించి, వీలైతే దిద్దుకునే ప్రయత్నాలు, కనీసం అటువైపు అడుగులు కదపాలి. మూర్ఖత్వంతో, అహంకారంతో, తిక్కతో అసలు నువ్వు ఏం చేశావో చెప్పు. నువ్వు చేసి చూపించు అనే ఎదురుదాడే మనకు తెలుసు.

ఏవో స్వార్ధ ప్రయోజనాలు ఆశించే నాటకాలు వెయ్యడం, అలాగే వేరే చీకటి లాభాలు ఆశించే నటించడం, నాటక ప్రయాణం సాగించడం, థియేటర్, థియేటర్ దాన్ని మీరు గౌరవించాలి అంతే. అని హుకుం జారీ చెయ్యడం!

(విమర్శకులు కూడా నాటకాలు వేస్తే మంచిదే! తక్కువ ఆర్థిక వనరులతో నాటకం వేయడం ఎంత కష్టమో తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో సమస్యలు అర్ధం అవుతాయి. మానవ సంబంధాలు పుస్తకాల్లో మాట్లాడ్డం కాదు, ఒక నాటకం కొన్ని ప్రదర్శనలు వేసి చూపించు, పగటి పూట చుక్కలు ఎలా వస్తాయో మీకు అర్ధం అవుతుంది. ఇది నిజం. (వెంటనే ఆర్ధిక లాభాలు ఏమీ కనిపించవు. పైగా నష్టాలు).

కేవలం విమర్శలు మాత్రమే చేసి పడేయడం కాకుండా…., నాటక ప్రయోక్తగా కొన్ని కనీస ప్రయత్నాలు కూడా చేయకపోతే ఎలా?!

అందుకే జయప్రభ ‘నాలుగో గోడకు’ విలువ లేకుండా పోయింది అని ఒకాయన అన్నాడు)

తెలుగులో టి జె రామనాధంగారు, ఉత్తర భారతంలో సబ్దర్ హష్మి లాంటివారు నిజంగా నాటకం కోసం బ్రతికారు. ఎన్నో త్యాగాలు చేశారు. బాదల్ సర్కార్, హాబీబ్ తన్వీర్ బాటలు మనకు తెలుసు. అలాగే ఎందరో జానపద కళాకారులు, ప్రజలను జాగృతం చేయడానికే వీధి నాటకాలు వేసిన వారు ఉన్నారు. జార్జ్ బెర్నార్డ్ షా, బ్రెక్టు, శామ్యూల్ బెకెట్, హెన్రిక్ ఇబ్సన్, షేక్స్పియర్, ఆస్కార్ వైల్డ్.., చాప్లిన్….., గ్రీక్, రోమన్..,.అంతర్జాతీయ వీక్షణం సరే, మన మట్టిలోని ఆణిముత్యాలు… భమిడిపాటి, కాళ్లకూరి, చలం, శ్రీశ్రీ, శిఖరం మహాకవి కాళిదాసు…పీల్చిన గాలి…, కొంచం అయినా వారి అడుగు జాడలు మనల్ని వినమ్రతతో ఉద్రేక పరచకపోతే ఎలా?!

మన తెలుగులో ఒక పెద్దాయన, తెలుగు నాటకాన్ని పరిషత్తు స్థాయి నుంచి ఒక్క అడుగు అయినా పెంచడం నా లక్ష్యం అని రాసుకున్నాడు! తర్వాత ఆయన కూడా నంది నాటకాల్లో, కొన్ని ప్రైవేట్ పరిషత్తులలో జడ్జీ గా కూర్చుంటున్నాడు! కలియుగపు హిపోక్రాటిక్ వింతలు… ఎన్నో మన తెలుగు నాటక వేదికలపై చూస్తున్నాము! పరిషత్తుల వల్ల కొన్ని అద్భుతాలు కూడా జరిగాయి! దయచేసి అందరినీ నిందిస్తున్నట్టు అనుకోవొద్దు!

వ్యాపారమే ధ్యేయంగా నడిచే పరిషత్తులు, అహంకారమే లక్ష్యంగా నడిచే సమాజాలు వాటిని ఎండ గడదాము! వాటి వెనుక వ్యక్తుల నిజ స్వరూపాలను బహిర్గతం చేద్దాం!

విశాల దృక్పథం వైపు అంతా ఎదుగుదాము! ఆత్మస్తుతి పరనింద ట్రాప్ నుంచి బయట పడదాం! ఒకరికి ఒకరం సహరించుకుని ఎదుగుదాము నాటకంతో పాటు!

2014 లో South African Playwright, designer, and Director Brett Bailey ఇలా emphasize చేశాడు, “irrepressible Spirit of Performance” that exists wherever human’s gather, from rural trees to high-tech stages. సరిగా అర్ధం చేసుకుందాం!

అణచి వేయలేని ఆవేదనలు, బాధలు, దహించే అవమానం…, అన్యాయం, కోపం, కన్నీళ్లు, హిపోక్రిసీని ఎండకట్టడం, ప్రేమ, మంచి మార్పు కోసం తపించే ఆత్మలు…., నిస్వార్థంగా పని చేసే ఎందరో కళాకారులు…, అన్నిటికీ మన తెలుగు నాటకం వేదిక అయ్యే దిశగా ఎదగాలి! మొత్తం ప్రపంచానికి దిక్సూచిగా మారాలి! ప్రపంచ నాటకంలో భాగం కావాలి! NSD, మన University Theatre departments…., స్వచ్ఛంద సంస్థలు అటువైపు …నడవాలి అని కోరుకుందాం!

The gratification comes in the doing, not in the result.

కదిలేది, కదిలించేది, … పాడేది, పాడించేది, పెను నిద్దర వదిలించేది, పరిపూర్ణపు బ్రతుకిచ్చేది …తెలుగు నాటకమై వెలగాలి! మహాకవి మంచి మాటలు నిజం కావాలి! జై తెలుగు నాటకం! అందరికీ నాటక రంగ దినోత్సవ శుభాకాంక్షలు!

___________________________________________________________

5.వినరో భాగ్యము వైకుంఠ వైభవము(శీర్షిక)

తిరుమలేశునికి పునుగుకాప్పు సేవ

తిరుమల క్షేత్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేకం సందర్భంగా సుగంధ భరితమైన పునుగు తైలాన్నిలేపనంగా వినియోగించడాన్ని పునుగు కాప్పు సేవ అంటారు.


క్రీ శ 966 లో గర్భాలయ మరమ్మతుల సమయంలో చేసిన బాలాలయ ప్రతిష్టకు పల్లవరాణి సామవై భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని సమర్పించినప్పుడు తరచుగా స్వామి మూలమూర్తికి అభిషేకం నిర్వహించేవారని శాసనాధారాలు పేర్కొంటున్నాయి. 11వ శతాబ్దంలో పూజ్య రామానుజాచార్యులు తిరుమల క్షేత్ర విధివిధానాలను క్రమబద్దీకరించిన సందర్భంలో మూలమూర్తి కుడి వక్షస్థలంపై లక్ష్మీ అమ్మవారి ప్రతిమను ప్రతిష్టించిన రోజును పురస్కరించుకుని శుక్రవారాభిషేక సేవ సంప్రదాయం కొనసాగుతున్నట్టు కూడా శాసనాలు తెలియచేస్తున్నాయి.

ఇక శతాబ్దాల నుంచి పునుగుపిల్లి నుంచి ప్రత్యేక సందర్భంలో స్రవించే తైలాన్ని అభిషేక సేవ సమయంలో మూలమూర్తి ముఖ భాగానికి లేపనంగా పూసేవారని క్రీ శ 1429, క్రీ శ 1434, క్రీ శ 1496, క్రీ శ 1506 నాటి దాన శాసనాల ద్వారా తెలుస్తోంది.


తిరుమలేశుని భక్తాగ్రేసరులలో ఒకరైన విజయనగర ప్రభువు శ్రీ కృష్ణదేవరాయలు శుక్రవారాభిషేక సమయంలో చేసే పునుగుకాప్పు సేవలో కేవలం ముఖ భాగానికే కాకుండా మొత్తం మూలమూర్తికి పునుగు తైలాన్ని లేపనంగా వినియోగించాలని క్రీ శ 1517 లో ని ర్ధేశించినట్టు క్రీ శ 1533 నాటి శాసనాధారాలు తెలియచేస్తున్నాయి ఆ సందర్భంగానే అభిషేకం, పునుగుకాప్పు సేవల కోసం కోసం వివిధ సుగంధ ద్రవ్యాలతో పాటు 200 సంచుల పునుగుతైలాన్ని వినియోగించడానికి వీలుగా గొడగూర్ నాడు నుంచి వేయి వరహాల సుంకం కేటాయిస్తూ శ్రీ కృష్ణ దేవరాయలు దాన శాసనం కూడా ఇచ్చినట్టు ఆధారాలు తెలియచేస్తున్నాయి.

అప్పటి నుంచి ఇప్పటివరకు శ్రీ కృష్ణ దేవరాయలు ఆదేశాల మేరకే స్వామి వారి మూలమూర్తికి అభిషేక అనంతరం పునుగుకాప్పు సేవ కొనసాగుతోంది.
ప్రతి శుక్రవారం నిర్వహించే ఆ ఆర్జిత సేవలో పాల్గొనే భక్తులు సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాల గిన్నెలను ఊరేగింపుగా గర్భాలయానికి తీసుకువెళ్లి అర్చకులను అందించే విధానం ఇప్పటికీ అమలులో ఉంది. సేవ లో వినియోగించడానికి ఒకప్పుడు తిరుపతిలోని గోశాలలో పునుగు పిల్లులను పెంచుతూ వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానాల (టి టి డి) యాజమాన్యం జంతు సంరక్షణ చట్టాల కారణంగా ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ లో అటవీ శాఖ పర్యవేక్షణలో ఉంచి తైలాన్ని సేకరిస్తూవస్తోంది.

ఓం నమో వేంకటేశాయ

మరిన్ని చక్కటి వ్యాసాలు, సరికొత్త శీర్షికలతో వచ్చేవారం కలుసుకుందాం…
మీ రచనలు, పుస్తక సమీక్షలు పంపవలసిన మా మెయిల్ఐడి. prabhanewscontent@
gmail.com

click here for more

Leave a Reply