ఇది సమిష్టి విజయం..

ఇది సమిష్టి విజయం..
విజయవాడ, ఆంధ్రప్రభ : టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరులో భారత క్రికెట్ జట్టు విజయం సాధించడం పట్ల ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ ఏ రవి నాయుడు హర్షం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్‌తో జరిగిన తుదిపోరులో భారత ఆటగాళ్లు సమష్టిగా రాణించి అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలవడం దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ భారత జట్టు సమన్వయంతో ఆడి ప్రత్యర్థి పై ఆధిపత్యం ప్రదర్శించిందన్నారు. కీలక సమయాల్లో ఆటగాళ్లు చూపిన పట్టుదల, ధైర్యసాహసాలు జట్టును విజయపథంలో నడిపించాయని తెలిపారు. ఈ విజయంతో భారత జట్టు మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు.
టీమిండియా విజయం పట్ల దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాలు జరుపుకోవడం ఆనందదాయకమని రవి నాయుడు తెలిపారు. టీ20 చరిత్రలో భారత్‌కు హ్యాట్రిక్ టైటిల్ దక్కడం భారత క్రికెట్‌కు మరింత గౌరవాన్ని తీసుకువచ్చిందన్నారు. ప్రపంచ వేదిక పై అద్భుత ప్రతిభ కనబర్చిన టీమిండియా ఆటగాళ్లకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భారత జట్టు సాధించిన ఈ విజయంతో దేశంలోని యువ క్రీడాకారుల్లో మరింత ఉత్సాహం, ప్రేరణ కలుగుతుందని రవి నాయుడు పేర్కొన్నారు.
