సమాజాభివృద్ధికి మహిళలే.. మూల స్తంభాలు..

సమాజాభివృద్ధికి మహిళలే.. మూల స్తంభాలు..

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : స్త్రీ లేకుండా సృష్టి లేదని, స్త్రీ లేకుండా జీవం లేదని, మహిళల గొప్పతనం, వారి శక్తి, త్యాగం ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నాయని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అన్నారు. సమాజాభివృద్ధికి మహిళలే మూల స్తంభాలంటూ ఆమె కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేసి మహిళలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. కుటుంబ నిర్మాణంలోనే కాకుండా దేశ నిర్మాణంలో కూడా మహిళల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ఒక మహిళ సాధికారత పొందితే.. ఆ కుటుంబం ముందుకు సాగుతుందని, ఒక కుటుంబం అభివృద్ధి చెందితే సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు నాలుగు కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పొందుతున్నారని పేర్కొన్నారు.

అదే విధంగా మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 67 లక్షల మంది విద్యార్థుల తల్లి ఖాతాలో ప్రతి సంవత్సరం రూ.15 వేల చొప్పున జమ చేస్తున్నామని వెల్లడించారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించి వారి ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు దక్కుతుందని గుర్తు చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా వారి పురోగతికి బాటలు వేసినట్లు తెలిపారు.

మహిళల భద్రత, ఆరోగ్యం, విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఇంటికి పరిమితమైన మహిళలను చట్టసభలకు తీసుకువచ్చి, వారి హక్కులు, సంక్షేమం కోసం పని చేసే అవకాశాన్ని కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వానికి చెందుతుందని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply