పేద విద్యార్థులకు 150 సైకిళ్ల పంపిణీ

పేద విద్యార్థులకు 150 సైకిళ్ల పంపిణీ
విజయవాడ, ఆంధ్రప్రభ: ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సురక్షా కమిటీ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు 150 సైకిళ్లను పంపిణీ చేశారు. సిటీ ఏఆర్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు.
సురక్షా కమిటీ కన్వీనర్ కె.వి. నరసయ్య ఆధ్వర్యంలో, మెడ్ ప్లస్ సహకారంతో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. చదువుకు దూరంగా ఉన్న పేద విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా సి పి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, నగరంలో సేఫ్టీ కల్చర్‌ను పెంపొందించడమే లక్ష్యంగా సురక్షా కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. కమిటీల సహకారంతో నగరంలో సుమారు 10,500 సీసీ కెమెరాల ఏర్పాటు సాధ్యమైందని చెప్పారు. మహిళా పోలీసు సిబ్బందికి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొండలపై 70 వేల విత్తనాలను డ్రోన్ల ద్వారా చల్లడం, తిరుమల తిరుపతి దేవస్థానానికి అన్నదానానికి కూరగాయలు పంపించడం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.
అదేవిధంగా పేద మహిళలకు 20 కుట్టు యంత్రాలు, వృద్ధులకు 6 టిఫిన్ బండ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. సమాజంలో సేవాభావంతో ముందుకు వస్తున్న సురక్షా కమిటీ ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డీసీపీలు, ఇతర పోలీసు అధికారులు, సురక్షా కమిటీ ప్రతినిధులు, మెడ్ ప్లస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
