డ్రగ్స్ పై దండయాత్ర ఒక పవిత్ర యజ్ఞం

డ్రగ్స్ పై దండయాత్ర ఒక పవిత్ర యజ్ఞం

డ్రగ్స్ పై దండయాత్ర సైకిల్ ర్యాలీకి కంచికచర్లలో ఘన స్వాగతం
మిక్ కళాశాలలో భారీ అవగాహన ర్యాలీ.. వేలాదిగా పాల్గొన్న విద్యార్థులు
పోలీసులను అభినందించిన ఎమ్మెల్యే సౌమ్య, సిపి రాజశేఖర్ బాబు

కంచికచర్ల, ఆంధ్ర‌ప్ర‌భ‌: డ్రగ్స్ పై దండయాత్ర ఒక పవిత్ర యజ్ఞం అని యువత చేతిలో గంజాయి కాదని గ్లోబల్ కంపెనీల ఆఫర్ లెటర్ ఉండాలని ప్రభుత్వ విప్, నందిగామ శాసన సభ్యురాలు తంగరాల సౌమ్య విద్యార్థులకు సూచించారు. శుక్రవారం స్థానిక మిక్ కళాశాలలో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సౌమ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.


35 రోజులు 500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసిన మహిళా పోలీస్ లను ఈ సందర్భంగా అభినందించారు. యువతే దేశం యొక్క నిజమైన సంపద అని, వారి కళ్ళల్లో ఉన్న కలలను డ్రగ్స్ అనే శత్రువు కూకటి వేళ్లతో పికిలించేస్తుందని అన్నారు. ఒక్కసారి డ్రగ్స్ ఊబిలో పడితే బయటపడటం ఎవరి చేతుల్లో ఉండదని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా కంచికచర్లకు సైకిల్ పై వచ్చిన ఐదుగురు మహిళా పోలీస్ లను ప్రత్యేకంగా అభినందించారు.


రేవతి, హైమావతి, శైలజ, త్రివేణి, ఉషారాణిలు 35 రోజులపాటు 500 కిలోమీటర్ల సైకిల్ తొక్కి డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారని, వారు సాధారణ పోలీసులు కాదని, సమాజంలోని చీకటిని తొలగించటానికి వచ్చిన వెలుగు కిరణాలని పేర్కొన్నారు, స్థానిక పోలీస్ అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు డ్రగ్స్ అనే పదం వినపడకూడదని ఎవరైనా గంజాయి అమ్మాలని చూస్తే వారికి చట్టం అంటే ఏమిటో చూపించాలని పోలీసులకు సూచించారు. విజయవాడపోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం పట్ల విద్యార్థులు యువత దూరంగా ఉండాలని సూచించారు.


డ్రగ్స్ బారినపడి తమ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. మత్తు పదార్థాలు వినియోగించడం నేరమని, అటువంటి వారిని సమాజంలో చులకనగా చూస్తారని పేర్కొన్నారు. స్వచ్ఛభారత్ రాష్ట్ర చైర్మన్ పట్టాభిరామ్ మాట్లాడుతూ యువత భాగస్వామ్యంతో డ్రగ్సును నియంత్రవచ్చునని అన్నారు. విద్యార్థులు చక్కగా చదివి తమ తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్ల కార్డులు ప్రదర్శిస్తూ కంచికచర్ల పట్టణంలో కనివిని ఎరుగని రీతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వద్దు బ్రో నినాదంతో చేపట్టిన ర్యాలీ ప్రజలను ఆకర్షించింది.


డీసీపీ కేజీవి సరిత, రూరల్ డిసిపి లక్ష్మీనారాయణ, నందిగామ ఏసిపి తిలక్, నందిగామ రూరల్ సిఐ డి చవాన్, కంచికచర్ల ఎస్సై పి. విశ్వనాధ్ తదితరులు విద్యార్థులలో చైతన్యం నింపే విధంగా ప్రసంగించటం విద్యార్థులను బాగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. వంశీ కిరణ్, వివిధ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, స్థానిక ప్రజలు ఉన్నారు. సైకిల్ ర్యాలీ ప్రదర్శనగా కంచికచర్ల పట్టణంలో ప్రధాన వీధుల్లో గుండా కొనసాగింది. సైకిల్ ర్యాలీ చేస్తున్న పోలీసులపై ప్రజల పూల వర్షం కురిపించారు.

Leave a Reply