సాగు నీళ్లు రాక రైతుల ఆవేదన

సాగు నీళ్లు రాక రైతుల ఆవేదన
నర్సంపేట, రూరల్, ఆంధ్రప్రభ : నర్సంపేట డివిజన్ పరిధిలో రైతులకు సాగునీరు అందించేందుకు కోట్ల రూపాయల వ్యయంతో తవ్విన కాలువలు ప్రస్తుతం పూడిక, చెత్త, చెట్లతో నిండిపోయి నిరుపయోగంగా మారాయి. కాలువలు నిర్మించి సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు ఒక్కసారి కూడా పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరగకపోవడం రైతుల్లో తీవ్ర అసంతృప్తి రేకెత్తిస్తోంది.
పూడికతో మూసుకుపోయిన కాలువలు..
గ్రామాల పరిధిలో నిర్మించిన ప్రధాన, ఉప కాలువల్లో చెట్లు పెరిగిపోయి, మట్టి పేరుకుపోయి కాలువల అసలు ఆకారం కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. పూడికతీత పనులు సంవత్సరాలుగా చేపట్టకపోవడంతో కాలువలు పూర్తిగా మూసుకుపోయాయి. కొన్నిచోట్ల కాలువలు చెత్తకుప్పలుగా మారాయి. రైతులు చెబుతున్నదాని ప్రకారం, కాలువల నిర్మాణం పూర్తయినా నీటి ప్రవాహం మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో వర్షాధార పంటలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ కాలువలు ప్రధానంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సార్ ఎస్పీ) పరిధిలో భాగంగా తవ్వినవే అయినా ఈ ప్రాజెక్టు ద్వారా నర్సంపేట ప్రాంతానికి సాగునీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ కాలువలు నిర్మాణానికే పరిమితమై నీటి సరఫరా మాత్రం ప్రారంభం కాలేదు.
నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం..
కాలువల నిర్వహణ బాధ్యత ప్రధానంగా నీటి పారుదల శాఖ (ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్)దే. కాలువల్లో పూడికతీత, చెట్ల తొలగింపు, మరమ్మతులు చేపట్టాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. అయితే సంవత్సరాలుగా ఈ పనులు చేపట్టకపోవడంతో కాలువలు పనికిరాని స్థితికి చేరుకున్నాయి. స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ, కాలువలు తవ్వినప్పుడు మా పొలాల్లో నీళ్లు వస్తాయని ఆశపడ్డాం. కానీ ఇప్పటివరకు ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. కాలువలు ఇప్పుడు అడవిలా మారిపోయాయని తెలిపారు.
వేల ఎకరాలు ఎండిపోయే ప్రమాదం….
ఈ కాలువలు పూర్తిస్థాయిలో పనిచేస్తే వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. కానీ నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోతున్నారు. బోర్లపై ఆధారపడాల్సి రావడంతో పెట్టుబడులు పెరిగి అప్పులబారిన పడుతున్నారు.
