వెట్టిచాకిరి నిర్మూలన సామాజిక బాధ్యత

వెట్టిచాకిరి నిర్మూలన సామాజిక బాధ్యత
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా
శ్రీకాకుళం(లీగల్), ఆంధ్రప్రభ : జిల్లాలో వెట్టిచాకిరీని పూర్తిగా రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా పిలుపునిచ్చారు. వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన చట్టం అమలులోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ), నేచర్ ఎన్జీఓ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం జిల్లా కోర్టు ఆవరణలో అవగాహన పోస్టర్లను ఆవిష్కరించి, సంచార వాహనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,.. తీసుకున్న అప్పుకు ప్రతిఫలంగా తక్కువ వేతనం లేదా అసలు వేతనం లేకుండా బలవంతంగా పనిచేయించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఈ చట్టం ప్రకారం వెట్టిచాకిరీ కింద ఉన్న పాత అప్పులన్నీ రద్దవుతాయని, బాధితులు ఆ అప్పును తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని, వారి ఆస్తులు యజమాని వద్ద తనఖాలో ఉంటే వాటిని విడిపించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
వెట్టిచాకిరీ చేయించుకునే యజమానులకు మూడేళ్ల జైలుశిక్షతో పాటు 2 వేల జరిమానా విధిస్తారని జడ్జి హెచ్చరించారు. డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కె. హరిబాబు మాట్లాడుతూ,.. 1976 వెట్టిచాకిరీ నిర్మూలన చట్టం దేశవ్యాప్తంగా వెట్టిచాకిరీని రద్దు చేసిందని, తెలిపారు. ముఖ్యంగా అసంఘటిత రంగాల్లోని కార్మికులు ఈ దోపిడీకి గురవుతున్నారని, వారిలో చైతన్యం తెచ్చేందుకు ఈ సంచార వాహనం జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది జి. ఇందిరా ప్రసాద్, నేచర్ ఎన్జీఓ డైరెక్టర్ ఎస్. వికాస్, ప్రతినిధులు చైతన్య, దుర్గ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
