నీటి వనరుల్లో ఆక్రమణలు అస్సలు సహించం

నీటి వనరుల్లో ఆక్రమణలు అస్సలు సహించం

సమన్వయంతో చర్యలు తీసుకోవాలి

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : నీటి వనరులు, చెరువులు వంటి వాటర్ బాడీస్‌లో ఎలాంటి ఆక్రమణలు ఉండకూడదని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నీటి వనరులు, చెరువుల ఆక్రమణలకు సంబంధించి జిల్లా స్థాయి వాచ్‌డాగ్ కమిటీ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడైనా చెరువులు, కుంటలు, వాగులు వంటి నీటి వనరులపై అక్రమ నిర్మాణాలు లేదా ఆక్రమణలు జరిగినట్లు గుర్తిస్తే వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలని సూచించారు.

ఆక్రమణలు జరుగుతున్న ప్రాంతాల్లో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సమాచారం అందిన వెంటనే పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే ఆక్రమణలను సమర్థవంతంగా నివారించగలమని పేర్కొన్నారు. నీటి వనరుల పరిరక్షణ పర్యావరణ సమతుల్యతకు, భూగర్భ జలాల నిల్వలకు అత్యంత కీలకమని, చెరువుల పరిమితులను కచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు.

సమావేశంలో డిఆర్ఓ సి. వెంకట నారాయణమ్మ, డిపిఓ భాస్కర్, కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, కర్నూలు అర్బన్ తహసీల్దార్ రవి, కర్నూలు రూరల్ తహసీల్దార్ రమేష్, కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply