డయేరియా పై స్పందన శూన్యం

డయేరియా పై స్పందన శూన్యం
శాసనమండలి లో ఎమ్మెల్సీ అరుణ్ కుమార్
ప్రభుత్వం స్పందించడం లేదంటూ తీవ్ర విమర్శలు
తాగునీటి నిర్వహణలో నిర్లక్ష్యం
ప్రజల ప్రాణాలు పణంగా పెడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు
విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో డయేరియా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని శాసనమండలిలో సభ్యుడు మొండితోక అరుణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యానికి సంబంధించిన కీలక సమస్యపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
ఏపీ అసెంబ్లీ ఐదవ సెక్షన్ శాసనమండలి సమావేశాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ మొండితో కరుణ్ కుమార్ మాట్లాడుతూ జగ్గయ్యపేట, తురకపాలెం, విజయవాడతో పాటు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో కూడా డయేరియా విజృంభిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా తురకపాలెంలో తాగునీటి నాణ్యతపై ప్రజలు ముందుగానే ఫిర్యాదు చేసినప్పటికీ, అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు.
నీటి ట్యాంకుల సరైన శుభ్రత, నిర్వహణ లేకపోవడం వల్లే పరిస్థితి విషమించిందని ఆయన అన్నారు. ప్రభుత్వం ‘చర్యలు తీసుకుంటున్నాం’ అని చెప్పడమే తప్ప, నేలస్థాయిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు” అని విమర్శించారు. డయేరియా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని, బాధిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
