Police | శబ్దం వస్తే .. కఠిన చర్యలు

Police | శబ్దం వస్తే .. కఠిన చర్యలు
అధిక శబ్ద సైలెన్సర్లు, ఆటో హారన్లపై కఠిన చర్యలు
రోడ్ రోలర్‌తో 100 బైక్ సైలెన్సర్లు, 500 ఆటో హారన్లు ధ్వంసం
– ఎస్పీ విక్రాంత్ పాటిల్
Police | కర్నూలు బ్యూరో, ఆంధ్ర ప్రభ: నగరంలో శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు కర్నూలు పోలీసులు రంగంలోకి దిగారు. అధిక శబ్దం కలిగించే 100 మోడిఫైడ్ బైక్ సైలెన్సర్లు, 500 ఆటో హరన్లను తొక్కించి ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస జెండా ఊపి ప్రారంభించారు. కర్నూలు పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయం, కొండారెడ్డి బురుజు సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లో స్వాధీనం చేసుకున్న సైలెన్సర్లు, హారన్లను ధ్వంసం చేశారు.
నగరంలో కొంతమంది యువకులు తమ ద్విచక్ర వాహనాలకు అధిక శబ్దం వచ్చేలా మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చుకుని ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నారని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అధిక శబ్దం కారణంగా వృద్ధులు, చిన్నారులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు సబ్ డివిజన్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కలిసి నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 100 బైక్ సైలెన్సర్లు, 500 ఆటో హారన్లను సీజ్ చేసినట్లు తెలిపారు. అనంతరం వాటిని రోడ్ రోలర్‌తో ధ్వంసం చేయించామని చెప్పారు.
మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం అనుమతి లేని మార్పులు చేసిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా మోడిఫై చేసిన సైలెన్సర్లు లేదా అధిక శబ్దం చేసే హారన్లు అమర్చినట్లయితే జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా సామాజిక బాధ్యతతో పబ్లిక్, ప్రైవేట్ సంస్థలు సహకారం అందిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా ట్రాఫిక్ పోలీసులకు డిజిటల్ ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డు, 66 సోలార్ రెడ్ బ్లింకింగ్ స్టడ్స్, నాలుగు అధునాతన మూవబుల్ బారికేడ్స్ దాతలు అందజేసినట్లు వెల్లడించారు.
ముఖ్యమైన రద్దీ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో రహదారి స్పష్టంగా కనిపించేలా మరిన్ని సోలార్ రెడ్ బ్లింకింగ్ స్టడ్స్ త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం దాతలైన కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం, గోల్డ్ షాప్ ప్రభాకర్, డి.ఈ. ఫణీ కుమార్‌లకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్, డిఎస్పీ జె. బాబు ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ సిఐ మధుసుధన్ రావు, ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.
