Stab | సౌండ్ తగ్గించమన్నాడు… అంతే…

Stab |సౌండ్ తగ్గించమన్నాడు… అంతే…
Stab |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పాపం ఆ భర్త టీవీ సౌండ్ తగ్గించమంటే.. ఏకంగా కత్తితో పొడిచి భర్తను చంపేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి తాలూకా పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి… గుంటూరు (guntoor) జిల్లా మంగళగిరి (Mangalagiri) లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన షేక్ అహ్మద్(26) (Sheikh Ahmed) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. ఏడాదిన్నర క్రితం మంగళగిరికి చెందిన క్రాంతి అనే మహిళతో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.
అయితే క్రాంతికి గతంలోనే పెళ్లయి మొదటి భర్త జైలులో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అహ్మద్‌ను పెళ్లి చేసుకుని మంగళగిరి టిడ్కో ఇళ్లలో బీ-16 బ్లాకులో నివసిస్తున్నారు. గురువారం రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్న అహ్మద్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్య పెద్ద శబ్ధంతో టీవీ చూస్తోంది.
సౌండ్ కొంచెం తగ్గించమని చెప్పడంతో క్రాంతి ఆగ్రహంతో అక్కడే ఉన్న కత్తితో భర్తను పొడిచింది. తీవ్రంగా గాయపడిన అహ్మద్‌ను విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి మహాబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మంగళగిరి పట్టణ సీఐ కె.వీరాస్వామి తెలిపారు. ఇంత చిన్న విషయానికే భర్తను కత్తితో పొడిచి చంపడంతో చుట్టుపక్కల వాళ్లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
