బెల్లంపల్లిలో బీఆర్ఎస్ బంద్..

బెల్లంపల్లిలో బీఆర్ఎస్ బంద్..
దుకాణాలు మూయించిన నేతలు
బాల్క సుమన్ అక్రమ అరెస్టుపై ఆగ్రహం
మంత్రి వివేక్ అరాచకాలు సాగనివ్వమంటూ హెచ్చరిక
బెల్లంపల్లి టౌన్, ఫిబ్రవరి 19(ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ గురువారం బెల్లంపల్లి పట్టణంలో బీఆర్ఎస్ చేపట్టిన బంద్ కొనసాగింది. ఉదయం నుంచే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని ప్రధాన చౌరస్తాల్లోకి చేరుకుని ఆందోళన చేపట్టారు. బజారులోని దుకాణాలు, వ్యాపార సంస్థల వద్దకు వెళ్లి బంద్కు సహకరించాలని కోరుతూ వాటిని మూయించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలను అక్రమ అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేయాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. మంత్రి వివేక్ వెంకటస్వామి జిల్లాలో అరాచక పాలన సాగిస్తున్నారని, పోలీసులను ఉసిగొలిపి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సుమన్ అరెస్టును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ నాయకులు నూనేటి సత్యానారాయణ, రాజులాల్ యాదవ్, ఆసాది మధు, సబ్బని అరుణ్, తదితరులు పాల్గొన్నారు.
