Anger | విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం

Anger | విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం
ప్రధానోపాధ్యాయుడికి షోకాజ్ నోటీసులు జారీ
Anger | గీసుగొండ,ఆంధ్రఅప్రభః వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామ జిల్లా పరిషత్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని ఆరేపల్లి అంగన్వాడి కేంద్రం ఫ్రెండ్లీ చైల్డ్ పాఠశాలగా ఎంపిక కావడంతో ముందుగా అక్కడి కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం సమీపంలోని ఎలుకుర్తి హవేలీ జిల్లా పరిషత్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను అధికారులతో కలిసి సందర్శించారు.
ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి వినియోగిస్తున్న బియ్యంలో పురుగులు కనిపించడం, విద్యార్థులకు సరిపడా కూర వడ్డించకపోవడం, కొంతమంది పిల్లలకు భోజనం అందకముందే ఆహారం ముగియడం వంటి విషయాలను గమనించిన జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యంతో రాజీ పడకూడదని స్పష్టం చేస్తూ, భోజన నాణ్యతపై నిర్లక్ష్యం వహించినందు కు సంబంధిత ప్రధానోపాధ్యాయు డికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే పాఠశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని కచ్చితంగా నిబంధనల ప్రకారం అమలు చేయాలని సిబ్బందికి సూచించారు.
ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించి, ఫలితాలను మెరుగుపరచే దిశగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలల అభివృద్ధి కోసం వినియోగించని నిధులను సమీకరించి అవసరమైన సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రధాన కార్యనిర్వాహ ణాధికారి రామ్ రెడ్డి, జిల్లా పంచాయతీరాజ్ శాఖాధికారి కల్పన, జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు, ఏఎంఓ సుజన్ తేజ,మండల విద్యాశాఖ అధికారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
