Rally | గుంటూరులో ఆర్మీ అగ్నివీర్..

Rally | గుంటూరులో ఆర్మీ అగ్నివీర్..
- ప్రారంభమైన రిక్రూట్మెంట్ ర్యాలీ
- ఫిబ్రవరి 27 వరకు ఎంపిక ప్రక్రియ..
- 8,598 మంది అభ్యర్థుల హాజరు
Rally | ఉమ్మడి గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో : గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభం అయింది. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సోమవారం అర్ధరాత్రి ఆర్మీ రిక్రూటింగ్ అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఫిబ్రవరి 27వ తేదీ వరకు జరుగుతుంది. నాగార్జున విశ్వవిద్యాలయంలో ఉన్న 4 వందల మీటర్ల సింథటిక్ ట్రాక్ సిద్ధం చేశారు. ఎంపిక ప్రక్రియ రాత్రి సమయంలోనే చేపట్టనున్నందున ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేశారు. శారీరక కొలతల పరీక్షలు, వైద్య పరీక్షలకు ఇండోర్ బాడ్మింటన్, జిమ్ భవనాలను సిద్ధం చేశారు. సింథటిక్ ట్రాక్ కు ఆనుకుని శారీరక ధారుడ్య పరీక్షలు, డ్రగ్ పరీక్షలు, అభ్యర్థుల హాజరు, వేచి ఉండు స్థలం, మొబైల్ టాయిలెట్స్ తదితర అవసరమైన ఏర్పాట్లు చేశారు. వైద్య శిబిరాలు, అంబులెన్స్ లు అందుబాటులో పెట్టారు.

అత్యవసర మందులు, అత్యవసర సమయంలో అధునాతన వైద్య సేవలు అందుటకు అంబులెన్సులు ఏర్పాటుతో పాటు హృద్రోగ నిపుణులు, ఎముకల నిపుణులను సిద్ధంగా చేశారు. లాబ్ టెక్నీషియన్ సేవలు కూడా అందుబాటులో ఉంచుతున్నారు. పారిశుధ్య నిర్వహణకు తగిన సిబ్బందిని ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యగా అగ్నిమాపక శకటాలు సిద్ధంగా పెట్టారు. పోలీస్ బందోబస్తు, అవసరమైన చోట బారికేడింగ్ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పురుష అభ్యర్థులకు నిర్దేశించిన ర్యాలీ అని ఆర్మీ రిక్రూటింగ్ డైరెక్టర్ కల్నల్ రజత్ సువర్ణ చెప్పారు . మొత్తం 8,598 మంది అభ్యర్థులు పాల్గొంటున్నారని అన్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లరికల్/ స్టోర్ కీపర్, ట్రేడ్స్ మెన్ తదితర విభాగాలలో 10వ తరగతి, 8వ తరగతి విభాగాలలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పారు.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వివిధ దశలలో జరుగుతుందని చెప్పారు. మొదటగా నాగార్జున విశ్వవిద్యాలయంలో గల సింథటిక్ ట్రాక్ పై 1.60 కిలో మీటర్ల పరుగు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాత్రి 2 నుండి ఉదయం 5 గంటల వరకు పరుగు పరీక్షలు జరుగుతాయని, ఈ సమయంలో అంతరాయం లేని విద్యుత్ అవశ్యం అన్నారు. అభ్యర్థులు స్పైక్ షూ లేదా కనీసం సాధారణ షూ ధరించడం మంచిదని కోరారు. తరువాత శారీరక పరీక్షలలో భాగంగా పుల్ అప్స్, జిగ్ జాగ్, 9 అడుగుల లాంగ్ జంప్ తదితర అంశాలలో పరీక్షించి అందులో ఎంపికైన వారికి ఎత్తు, బరువు తదితర శారీరక కొలతల పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. అందులో ఎంపికైన వారికి పేరాగ్రాఫ్ రాయించడం జరుగుతుందన్నారు.

అనంతరం డ్రగ్ పరీక్షలు, మెడికల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. అభ్యర్థులు వారికి నిర్దేశించిన సమయంలో రిక్రూట్మెంట్ ప్రదేశానికి చేరుకోవాలని చెప్పారు. పరుగు ప్రక్రియ అర్ధ రాత్రి 12 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. అభ్యర్థుల శరీరంపై ఎక్కడా ఐదు సెంటిమీటర్లు మించి టాటూలు ఉండరాదని, అయితే గిరిజన తెగలకు మాత్రం వారి ఆచారాల మేరకు వెసులుబాటు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తుది పరీక్షలలో ఎంపికైన అభ్యర్థులకు రెండు, మూడు నెలల తర్వాత సులభ మెడికల్ పరీక్షలు నిర్వహించి, నియామకం చేయడం జరుగుతుందని చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు వారు రిజిస్టర్ చేసుకున్న ఇ – మెయిల్ కు నియామక ఉత్తర్వులు పంపించడం జరుగుతుందన్నారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారిని సమన్వయ అధికారిగా నియమించారు.

