excitement | బెల్లంపల్లి మున్సిపల్ పీఠంపై ‘హస్తం’ పట్టు!

excitement | బెల్లంపల్లి మున్సిపల్ పీఠంపై ‘హస్తం’ పట్టు!
చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక: ఉత్కంఠ రేపుతున్న కౌన్సిల్ మీటింగ్
కీలకమైన 50 శాతం కోరం.. సబ్ కలెక్టర్ మనోజ్ పర్యవేక్షణలో పోలింగ్
కాంగ్రెస్ అభ్యర్థిగా దావ స్వాతి ఖరారు? వైస్ చైర్మన్ పీఠంపై రాగం శెట్టి కన్ను
క్యాంపుల నుంచి నేరుగా మున్సిపల్ ఆఫీస్‌కు.. భారీ బందోబస్తు మధ్య కౌన్సిలర్ల రాక
ఎమ్మెల్యే గడ్డం వినోద్ ‘ఎక్స్ అఫీషియో’ ఓటు కీలకం
excitement | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: సింగరేణి బొగ్గు గనుల పట్టణం బెల్లంపల్లి మున్సిపల్ రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. గత వారం రోజులుగా సాగుతున్న ఉత్కంఠభరితమైన క్యాంపు రాజకీయాలు, రిసార్ట్ పాలిటిక్స్ నేటితో ముగియనున్నాయి. మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ బలాబలాలను నిరూపించుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈ పీఠాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బెల్లంపల్లి ఎన్నికపై ఆసక్తి నెలకొంది.
ఎన్నికల అధికారిగా సబ్ కలెక్టర్.. భారీ ఏర్పాట్లు
మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను ప్రత్యేక ఎన్నికల అధికారిగా నియమించింది. ఆదివారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, ఎన్నికకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. 34 మంది కౌన్సిలర్లు ఉన్న ఈ సభలో ఎన్నిక జరగాలంటే కనీసం 50 శాతం కోరం (18 మంది సభ్యులు) ఉండాలని స్పష్టం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ సభ్యులకు విప్ జారీ చేసినట్లు తనకు సమాచారం అందిందని, బీఆర్ఎస్ నుంచి ఎలాంటి దరఖాస్తు అందలేదని ఆయన పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తామని, ఎవరైనా విప్ ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఎమ్మెల్యే వ్యూహం..
బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ‘హంగ్’ పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 14 స్థానాల్లో సమంగా నిలవగా, ఐదుగురు స్వతంత్రులు, ఒక బీజేపీ సభ్యుడు కింగ్ మేకర్లుగా మారారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని, బెల్లంపల్లి పీఠాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేయాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ‘ఎక్స్ అఫీషియో’ సభ్యునిగా తన ఓటును నమోదు చేసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థులను, ఇతర పార్టీల అసంతృప్త నేతలను కాంగ్రెస్ గూటికి చేర్చడంలో ఆయన సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది.
చైర్మన్ పీఠం ఎవరికి?
చైర్‌పర్సన్ పదవి మహిళా జనరల్ కావడంతో, 7వ వార్డు నుంచి గెలుపొందిన కాంగ్రెస్ కౌన్సిలర్ దావ స్వాతి పేరును పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. ఆమెకు 13 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు నలుగురు స్వతంత్ర సభ్యులు మద్దతు తెలుపుతున్నారు. ఇక వైస్ చైర్మన్ పదవి కోసం 17వ వార్డు కౌన్సిలర్ రాగం శెట్టి సత్యనారాయణ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే వినోద్ ఆశీస్సులతో పాటు మెజారిటీ కౌన్సిలర్ల మద్దతు తనకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
క్యాంపుల్లో అలజడి.. బీజేపీ కౌన్సిలర్ యూ-టర్న్!
మున్సిపల్ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. 34వ వార్డు బీజేపీ కౌన్సిలర్ కొక్కుల రామ్మూర్తి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి వరకు బీఆర్ఎస్ శిబిరంలో కనిపిస్తూ మద్దతు ఇస్తానని చెప్పిన ఆయన, హఠాత్తుగా కాంగ్రెస్ నిర్వహించిన రహస్య శిబిరంలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అలాగే బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ 26వ వార్డు కౌన్సిలర్ ఇప్ప కుమారస్వామి, 30వ వార్డు స్వతంత్ర సభ్యురాలు సుఖేషిని భరద్వాజ్ లు సైతం నేటి సమావేశానికి హాజరు కానున్నారు.
సోమవారం ఉదయం 10:30 గంటలకు కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటారు. ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పట్టణంలో 144 సెక్షన్ విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కొద్ది గంటల్లో బెల్లంపల్లి మున్సిపల్ పీఠం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి!




