Ghantasala | ఘంటసాలకు ఘనంగా నివాళులు..

Ghantasala | ఘంటసాలకు ఘనంగా నివాళులు..

Ghantasala | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: సినీ సంగీత ఆకాశంలో ధ్రువతారగా వెలుగొందిన అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 50వ వర్ధంతి సందర్భంగా చిత్తూరు జిల్లా కేంద్రంలో ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా ఘంటసాల సంఘం ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, అభిమానులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

మధుర గానంతో కోట్లాది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అపూర్వ గాయకుడు ఘంటసాల అని ఘంటసాల సంఘం జిల్లా అధ్యక్షుడు ఉజ్జని రవినాయుడు కొనియాడారు. ఆయన పాడిన పాటలు సూర్యుడు, చంద్రుడు ఉన్నంత వరకు తెలుగు ప్రజల హృదయాల్లో మారుమోగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. ఘంటసాల గానం అనేది కేవలం సంగీతం మాత్రమే కాకుండా, భావోద్వేగాల ప్రవాహమని అన్నారు.

ఘంటసాల స్వరం తరతరాలకు మార్గదర్శకమని జిల్లా సైనిక సంక్షేమ శాఖాధికారి రాఘవులు తెలిపారు. నేటి తరం గాయకులకు ఆయన ఓ జీవంతమైన ఆదర్శమని పేర్కొన్నారు. భక్తి, భావం, భాష – ఈ మూడు విలువలను సమన్వయం చేసిన గాత్రం ఘంటసాలదేనని అన్నారు. ఘంటసాల సంఘం జిల్లా కార్యదర్శి మురుగేష్ మాట్లాడుతూ, ఘంటసాల తిరుమల తిరుపతి దేవస్థానం తొలి ఆస్థాన విద్వాంసుడిగా సేవలందించి అనేక భక్తి గీతాలతో భక్తుల్లో భక్తి పారవశ్యాన్ని నింపారని తెలిపారు. ఆయన పాడిన సుప్రభాతాలు, భజనలు, శ్లోకాలు ఇప్పటికీ ఆలయాల్లో మారుమోగుతున్నాయని చెప్పారు.

పారిశ్రామిక వేత్త వినాయక బాలాజీ, జెడ్‌ఎస్‌ఎస్ మాజీ ఉద్యోగి త్యాగరాజులు నాయుడు మాట్లాడుతూ, ఘంటసాల ఆలపించిన భగవద్గీత శ్లోకాలు యుగయుగాలపాటు నిలిచిపోతాయని అభిప్రాయపడ్డారు. ఆ గానం వినగానే ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని తెలిపారు. వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శివశంకరరెడ్డి, సుందరమూర్తి, షణ్ముగం మాట్లాడుతూ, ఘంటసాల వంటి గాయకుడు మళ్లీ పుట్టడం అరుదని అన్నారు. ఆయన పాటలు పండితులనూ, పామరులనూ ఒకేలా అలరించాయని చెప్పారు.

మాజీ కాణిపాకం పాలకవర్గ సభ్యుడు అప్పోజీ, మాజీ ఎం.పి.టి.సి సభ్యుడు కుప్పిగానిపల్లి మధుసూదన్, ప్రముఖ “శిఖండి” చిత్రం దర్శకుడు, నటుడు కోడికిషోర్ మాట్లాడుతూ, ఘంటసాల పాటల్లో ఉన్న ఉచ్చారణ, భావం, రాగాల మాధుర్యం అనన్యసామాన్యమని కొనియాడారు. ప్రతి మనసును కదిలించే శక్తి ఆయన స్వరానిదని అన్నారు.గిరింపేట వీరాంజనేయస్వామి ఆలయ చైర్మన్ కుమార్, సీసీ వృత్తిపర విద్యా కళాశాల ప్రతినిధి సతీష్, ఆర్టీసీ మాజీ ఉద్యోగి రాజశేఖర్, నెడ్‌క్యాప్ ఉమాపతి, కాజురు సుబ్బా, రేవా వ్యవస్థాపకులు నానబాల లోకేష్, నటుడు సంతపేట టీవీ శ్రీనివాసులు తదితరులు ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు కాజురు బాబు, జి. గోవిందయ్య చెట్టి, అలాగే మిట్టూరు వి.ఆర్. వృత్తిపర జూనియర్ కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అంతా ఘంటసాల గానామృతంతో మార్మోగి, సంగీతానురాగులకు స్మరణీయంగా నిలిచింది.

Leave a Reply