Guntur | అష్టదిగ్బంధంలో నగరం..

Guntur | అష్టదిగ్బంధంలో నగరం..
- అంబటి నివాసానికి బయలుదేరిన జగన్
గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి బయలుదేరడంతో గుంటూరు నగరం ఒక్కసారిగా అట్టుడికిపోయింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు నగరాన్ని అష్టదిగ్బంధం చేశారు. గుంటూరులో పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తూ ర్యాలీలు, సభలపై నిషేధం విధించారు. ఇప్పటికే పలువురు వైసీపీ ముఖ్య నేతలైన మాజీ ఎంపీ వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ చుక్క ఏసూరత్నం, నూరి ఫాతిమా సహా పలువురికి అర్ధరాత్రి వేళ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Guntur | ఎక్కడికక్కడ పోలీసుల పహారా..
నగరంలోకి ఇతరులు ప్రవేశించకుండా మేడికొండూరు, నందిగామ అడ్డరోడ్డు, పేరేచర్ల, నల్లపాడు, యడ్లపాడు మరియు బోయపాలెం సమీపంలోని జాతీయ రహదారులపై భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పల్లెలు, పట్టణాల నుండి జనం గుంటూరుకు రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అంబటి నివాసం ఉన్న సిద్ధార్థ నగర్ ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కేవలం ద్విచక్ర వాహనాలకు మాత్రమే అనుమతినిస్తూ, కార్ల ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేశారు.

Guntur | జగన్ కాన్వాయ్ నిలుపుదల.. కొనసాగుతున్న జాప్యం
తాడేపల్లి నివాసం నుండి ఉదయం 10:30 గంటలకే బయలుదేరిన వైఎస్ జగన్, మధ్యాహ్నం ఒకటిన్నర గంటలు దాటినా అంబటి నివాసానికి చేరుకోలేకపోయారు. సాధారణంగా అరగంట పట్టే ప్రయాణానికి గంటల కొద్దీ జాప్యం జరగడానికి పోలీసుల ఆంక్షలే కారణమని తెలుస్తోంది. ఆటోనగర్ సమీపంలో జగన్ మినహా మిగిలిన కాన్వాయ్‌ను పంపేది లేదని పోలీసులు ఖరాఖండిగా చెప్పడంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అంబటి ఇంటి సమీపంలో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కార్యాలయం ఉండటంతో, ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరగకుండా పోలీసులు బారికేడ్లు నిర్మించారు.

Guntur | పోటెత్తిన వైసీపీ శ్రేణులు..
పోలీసు ఆంక్షలు ఎన్ని ఉన్నప్పటికీ, వైసీపీ కార్యకర్తలు గల్లీ గల్లీ నుంచి పెద్ద ఎత్తున సిద్ధార్థ నగర్ చేరుకుంటున్నారు. ‘జై జగన్.. సీఎం సీఎం’ అన్న నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగుతోంది. మాజీ హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్సీ ఏసురత్నం, లేళ్ల అప్పిరెడ్డి, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైసిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు యనుమల మురళీధర్ రెడ్డి, సత్తెనపల్లి వైసిపి ఇన్చార్జ్ సుధీర్ భార్గవ రెడ్డి తదితర నేతలు అంబటి నివాసానికి చేరుకొని జగన్ రాక కోసం వేచి ఉన్నారు. ఇదిలా ఉండగా, అంబటి రాంబాబు కుమార్తె మౌనిక పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ ఇంటిపై జరిగిన విధ్వంసానికి సంబంధించిన ఆనవాళ్లను చెరిపివేసేందుకు పోలీసులు రాత్రి నుంచి ప్రయత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. గుంటూరులో ఉద్రిక్తత కొనసాగుతోంది.
CLICK HERE TO READ జనవాణిలో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
