Social media | బాలుడి కోసం వెళ్లిన బాలిక..

Social media | బాలుడి కోసం వెళ్లిన బాలిక..
- విజయవాడ రూరల్ మండలంలో ఘటన
- పామర్రు నియోజకవర్గంలోని బాలుడి ఇంటికి వెళ్లిన బాలిక..
- ఇక్కడే ఉంటానంటూ మొండికేసిన బాలిక
- అడ్రస్ అడిగితే ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరింపు
- బాలిక కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన తల్లి
Social media | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : సోషల్ మీడియా (సామాజిక మాధ్యమం) స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి, ఆలోచనలు, ఫోటోలు, వీడియోలు, సమాచారాన్ని షేర్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటారు. కానీ దీనిని మనం ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. సోషల్ మీడియాతో ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలూ ఉన్నాయి. ప్రధానంగా యువత మీద సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.
ఉదయం నిద్రలేవగానే వాట్సప్ ఓపెన్ చేసి కామెంట్లు, ఫేస్ బుక్ లో లైక్స్ చూడనిదే చాలామంది రోజు మొదలవ్వదు. ఇది అంతా ఒక ఎత్తు అయితే సోషల్ మీడియాలో జరిగే పరిచయాలు కొందరి జీవితాన్ని ఆగం చేస్తున్నాయి. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా యాప్‌లు మైనర్ల జీవితాలపై ఎంతటి ప్రభావం చూపుతున్నాయో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ప్రసాదంపాడులో జరిగిన ఈ సంఘటనే నిదర్శనంగా నిలుస్తోంది.
16 ఏళ్ల బాలిక ఇన్ స్టాలో పరిచయమైన బాలుడి ఇల్లు వెతుక్కుంటూ వెళ్లింది. బాలిక కనిపించకపోవడంతో ఇటు తల్లి, అటు నేరుగా తమ ఇంటికి రావడంతో బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. విజయవాడ రూరల్ మండలంలో ఓ బాలిక ఇల్లు విడిచి వెళ్లడం కలకలం రేపింది. అమ్మమ్మ ఇంటి నుంచి అమ్మ దగ్గరికి వెళతానంటూ బయలుదేరిన 16 ఏళ్ల బాలిక ఇన్ స్టాలో పరిచయమైన బాలుడి ఇల్లు వెతుక్కుంటూ వెళ్లింది. బాలిక కనిపించకపోవడంతో ఇటు తల్లి, అటు నేరుగా తమ ఇంటికి రావడంతో బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే..
విజయవాడ రూరల్ మండలంలోని ప్రసాదంపాడుకు చెందిన 16 సంవత్సరాల బాలిక పదో తరగతి ఫెయిలై చదువు ఆపేసింది. స్థానికంగా ఉన్న ఓ దుకాణంలో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఇన్ స్టాలో ఓ బాలుడితో పరిచయం కాగా నిత్యం ఛాటింగ్ చేస్తోంది. ఇది గమనించి తల్లి మందలించింది. దీంతో ఈ నెల 21న అమ్మమ్మ ఇంటికి వెళ్లిన బాలిక.. రాత్రి అమ్మ దగ్గరకు వెళుతున్నానని చెప్పి బస్సెక్కింది. ఇన్ స్టాలో పరిచయమైన బాలుడి ఇల్లు వెతుక్కుంటూ వెళ్లింది.
పామర్రు నియోజకవర్గంలోని కూచిపూడిలోని బాలుడి ఇంటికి వెళ్లి అతడితో పాటే ఉంటానని చెప్పింది. బాలిక చిరునామా, తల్లి ఫోన్ నెంబర్ కోసం బాలుడి కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. ఆ వివరాలేవీ చెప్పనని, గట్టిగా అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని బాలిక బెదిరించింది. దీంతో ఆందోళన చెందిన బాలుడి కుటుంబం.. నెమ్మదిగా నచ్చజెప్పి బాలిక తల్లి ఫోన్ నెంబర్ తీసుకున్నారు.
ఆపై ఫోన్ లో బాలిక తల్లికి సమాచారం అందించి తామే వెంటబెట్టుకుని తీసుకొస్తున్నట్లు తెలిపారు. అమ్మమ్మ ఇంటికి వెళ్లిన కూతురు మరుసటి రోజు కూడా రాకపోవడంతో తల్లి తన అమ్మకు ఫోన్ చేసింది. తను ముందురోజు రాత్రే బయలుదేరిందని చెప్పడంతో తల్లి ఆందోళనకు గురై కూతురుకు ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాలుడి ఇన్‌స్టా ఐడీ ద్వారా లోకేషన్ కనిపెట్టారు. పామర్రు నియోజకవర్గం కూచిపూడిలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి బయల్దేరగా.. బాలుడి కుటుంబ సభ్యుల నుంచి బాలిక కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. పోలీసులు బాలిక, బాలుడిని పటమట స్టేషన్‌కు తీసుకువెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
