AP | బౌద్ధ సాంప్రదాయ ప్రకారం గృహప్రవేశం
AP | బౌద్ధ సాంప్రదాయ ప్రకారం గృహప్రవేశం
- బుద్దునికి ప్రత్యేక పూజలు చేసిన ఎన్ఆర్ఐ గొర్రెపాటి రంగనాథ్ బాబు దంపతులు
- గృహ ప్రవేశం సందర్భంగా ఊరందరికీ ఆహ్వానం
AP | ఆంధ్రప్రభ, కృష్ణా బ్యూరో : గొర్రెపాటి వెంకట్రాయులు- ఉదయభాస్కరమ్మ ట్రస్ట్ అధినేత, ప్రవాస భారతీయులు గొర్రెపాటి రంగనాధ్ బాబు కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామంలో నిర్మించి నూతన గృహంలోకి సాంప్రదాయ ప్రకారం గృహప్రవేశం చేశారు. బౌద్ధ భిక్షువు బంతేజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బంతేజీ బుద్ధుని ప్రతిమ చేతబూని, రంగనాధ్ బాబు – ఇందిర దంపతులు గౌతమ బుద్ధుని చిత్రపటంతో నూతన గృహంలోకి అడుగు పెట్టారు. బౌద్ధమతంలో సమానత్వం ఉందని భావించిన రంగనాధ్ బాబు ఆ మతాన్ని అనుసరిస్తూ బౌద్ధదమ్మచారిగా కొనసాగుతున్నారు. పంచ సూత్రాల ద్వారా ప్రపంచ మానవళికి బుద్దుడు చూపిన మార్గంలో అనుసరణీయమని, ఆ మార్గంలోనే మంచి ఉందని రంగనాధ్బాబు బావించారు.

అమెరికాలో స్థిరపడిన రంగనాథ్ బాబు ఘంటసాల గ్రామం మీద ఉన్న ప్రేమతో సంవత్సరానికి రెండు, మూడు సార్లు స్వగ్రామానికి వస్తూ గ్రామాభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. నూతన గృహం ముందు ఏర్పాటు చేసిన బుద్ధుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, కొండపల్లి రామకృష్ణ, టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరిబాబు, శ్రీకాకుళం డీసీ చైర్మన్ అయినపూడి భాను ప్రకాష్, ఘంటసాల పీఏసీఎస్ అధ్యక్షులు బండి పరాత్పరరావు, గ్రామ ప్రముఖులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

బుద్ధుడు చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వ భావన కలిగి ఉన్న గొర్రెపాటి రంగనాథ్ బాబు కులమతాలకతీతంగా గ్రామంలోని వారందరికీ గృహ ప్రవేశానికి రావాలని ఆహ్వానం పలికారు ఘంటసాల గ్రామంలో సుమారు 7 వేల మంది జనాభా ఉంటారు. గ్రామంలోని వారందరూ తన కుటుంబసభ్యులే అనే భావనలో ఆయన ప్రతీ గడప గడపకు ఆహ్వానం పలకటం విశేషం. ప్రతీ కుటుంబం నా కుటుంబమనే ఆలోచనతో గ్రామంలోని ప్రజలందరికి అన్నసమారాధన ఏర్పాటు చేయటం విశేషం.
