5days | ఇరాన్ యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భయమా? వ్యూహమా?

5days | ఇరాన్ యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భయమా? వ్యూహమా?
5days | యుద్ధ విరామం వెనుక అసలు కారణాలేమిటి?
హోర్ముజ్ ప్రభావం.. మిత్రదేశాల వైఖరి
భయం వ్యూహం.. ట్రంప్ నిర్ణయంపై విశ్లేషణ
5days | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో యుద్ధవాతావరణం, ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్న వేళ, మరింత ముదిరితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలో అని ప్రపంచ దేశాలు ఊపిరిబిగపట్టి చూస్తున్నవేళ…..
ఇరాన్‌పై దాడులకు అమెరికా అకస్మాత్తుగా విరామం ప్రకటించడం అంతర్జాతీయంగా ఆశ్చర్యానికి గురిచేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక శాంతికాముకత్వం కానేకాదని అందరికీ స్పష్టంగా తెలుసు. మరి అసలు కారణాలేమిటన్న దానిపై రాజకీయ, రక్షణ రంగాల్లో తీవ్రమైన ఆలోచనలు, విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటి వరకు “యుద్ధం ఆపేదే లేదు” అన్న ధోరణి ట్రంప్ లో కనిపించినా, ఒక్కసారిగా వెనక్కి తగ్గడం వెనుక కేవలం దౌత్య ప్రయత్నాలే కారణమా? లేక అంతర్జాతీయంగా మిత్రదేశాల నుండి ఒత్తిడి కూడా పనిచేసిందా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కొన్నిరోజుల క్రితం హోర్ముజ్ వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారినప్పటికీ, అమెరికా పిలుపు మేరకు మిత్రదేశాల నుంచి పూర్తి స్థాయి మద్దతు లభించలేదన్న సమాచారం రక్షణ వర్గాల్లో వినిపిస్తోంది.
హోర్ముజ్ జలసంధి…ఇది ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషించే రవాణా మార్గం. హోర్ముజ్ జలసంధి వద్ద ఏ చిన్న ఉద్రిక్తతలు చెలరేగినా, ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపడం సహజం. ఈ నేపథ్యంలో, ఇరాన్ పై యుద్ధం విషయంలో అమెరికా ఒంటరిగా ముందుకు వెళ్లాల్సి వస్తుందన్న సంకేతాలు ట్రంప్ కి అప్పుడే కనిపించడంతో యుద్ధం నుంచి వ్యూహాత్మకంగా విరామం తీసుకున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది ఒకరకంగా అమెరికా వెనుకడుగే అయినప్పటికీ, ప్రపంచ దేశాలన్నీ ఊపిరి పీల్చుకునే మంచి విషయమే.
ఇక యూరోపియన్ దేశాలు కూడా మరో పెద్ద యుద్ధానికి ఆసక్తి చూపడం లేదని, అసలు యుద్ధాలే కోరుకోవడం లేదనీ, అంతర్జాతీయ మీడియా నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. ముఖ్యంగా యుద్ధం మరింత విస్తరించితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా పై మిత్ర దేశాల నుంచి ఒకింత ఒత్తిడి వచ్చిందనే విషయం కాదనలేం.
అదే సమయంలో, ఇరాన్ వర్గాలు మాత్రం మరో కోణాన్ని ప్రస్తావిస్తున్నాయి. అమెరికా దాడులకు విరామం ప్రకటించడం వెనుక ట్రంప్ లో మొదలైన భయం కూడా కారణమై ఉండొచ్చని వారు అంటున్నారు. ముఖ్యంగా ఇరాన్ రక్షణ సామర్థ్యం, యుద్ధంలో ప్రతిదాడి చేయగల శక్తి పెరిగిన నేపథ్యంలో ఆ దేశంతో అమెరికా జాగ్రత్తగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎటువంటి ధృవీకరణ లేదు.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇది పూర్తిగా వెనకడుగు కాకపోవచ్చు.. ఒక వ్యూహాత్మక విరామం మాత్రమే కావచ్చు. యుద్ధం కొనసాగించాలా? లేక చర్చల ద్వారానే సామరస్యంగా పరిష్కారం అన్వేషించాలా అనే అంశంపై అమెరికా ఆలోచనలో పడిందని విశ్లేషకుల అంచనా.

మరోవైపు, ఈ విరామాన్ని ఉపయోగించుకుని అమెరికా తన సైనిక, ఆర్థిక వ్యూహాలను పునర్వ్యవస్థీకరించుకునే అవకాశం కూడా ఉంది. యుద్ధంలో అమెరికా చేసిన ఆయుధాల వినియోగం, యుద్ధం పై వెచ్చించిన డబ్బు వల్ల పెరిగిన ఆర్థిక ఒత్తిడి, అంతర్జాతీయ సంబంధాలు ఇవన్నీ కలిపి ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి కారణమై ఉండొచ్చని అంచనా.
ట్రంప్ నిర్ణయం వెనుక “భయం” అనే అంశం ఉందా? లేక “వ్యూహం” అనే కోణమే ప్రధానమా? అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది, పశ్చిమాసియాలో పరిస్థితులు మాత్రం ఇంకా కుదుటపడలేదు, ఇంకా అనిశ్చితిలోనే ఉన్నాయి.
