గోపి చెరువు ఆయకట్టులో ఎండిన పొలాలు

కన్నీళ్లు పెడుతున్న అన్న‌దాత‌లు
నీళ్లు ఉన్నా పంటలకు ఎందుకు ఇవ్వరు?
300 ఎకరాల రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్

జనగామ, ఆంధ్రప్రభ: జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని చిన్నమడూర్‌లో సాగునీటి కొరతతో పంట పొలాలు బీడుగా మారుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం గోపి చెరువు ఆయకట్టు పరిధిలోని సుమారు 300 ఎకరాల పంట పొలాలను ఆయన పరిశీలించారు. పచ్చని పంటలతో కళకళలాడాల్సిన పొలాలు నాట్లు పడక వెలవెలబోతుండటాన్ని చూసి రైతులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. గోపి చెరువులో నీరు లేకపోవడంతో ఆయకట్టు కింద ఉన్న రైతులు పంటలు వేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. “చెరువులో నీళ్లు లేవు.. పొలాల్లో వరి నాట్లు లేవు.. రైతుల కళ్లలో మాత్రం కన్నీళ్లే మిగిలాయి” అని వ్యాఖ్యానించారు.

గత పదేళ్లలో ఎన్నడూ లేని దుస్థితి ప్రస్తుతం నెలకొందని ఎర్రబెల్లి ఆరోపించారు. వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే రైతులు సాగునీరు అందక పొలాలను పడావుగా పెట్టుకోవాల్సి వస్తోందని అన్నారు. నీటిని అందించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం రైతుల సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

రిజర్వాయర్ నీటిని విడుదల చేయాలి

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా నవాబుపేట రిజర్వాయర్‌ను నింపి, దాని ద్వారా చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లకు నీటిని అందించామని ఎర్రబెల్లి దయాకర్‌రావు గుర్తుచేశారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ రైతుల పొలాలకు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రైతులు పంటలు వేసుకోకుండా పొలాలను బీడుగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎవరి వైఫల్యమో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సంక్షేమం కేవలం ప్రకటనల్లో కాకుండా, పంట పొలాలకు నీరు అందించడం ద్వారా చేతల్లో కనిపించాలని అన్నారు.

300 ఎకరాల రైతులను ఆదుకోవాలి

నవాబుపేట రిజర్వాయర్ నుంచి వెంటనే నీటిని విడుదల చేసి గోపి చెరువు ఆయకట్టు కింద ఉన్న సుమారు 300 ఎకరాల రైతులను ఆదుకోవాలని ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాగునీరు అందక రైతులు పంటలు కోల్పోయే పరిస్థితి రాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

“రైతు పొలంలో నీరు లేకపోతే అది రైతు తప్పు కాదు.. ప్రభుత్వ వైఫల్యం. రైతుల కన్నీటికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే” అని ఆయన అన్నారు.

రైతుల పట్ల ఇదే నిర్లక్ష్య ధోరణి కొనసాగితే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించి సాగుకు అవసరమైన నీటిని అందించాలని డిమాండ్ చేశారు.