అలా చేస్తే.. కఠిన చర్యలు తప్పవు

అలా చేస్తే.. కఠిన చర్యలు తప్పవు

నస్పూర్, ఆంధ్రప్రభ : ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్టకు కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ పేర్కొన్నారు. సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంఘమల్లయ్య పల్లె గ్రామంలో అర్ధరాత్రి ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రజలతో డీసీపీ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పని చేస్తున్న వ్యక్తుల పై పోలీసుల నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. స్థానికంగా ఇళ్లు అద్దెకు ఇచ్చే యజమానులు అద్దెదారుల పూర్తి వివరాలు తప్పనిసరిగా సేకరించాలని సూచించారు. ముఖ్యంగా వారి ఆధార్ కార్డు, శాశ్వత చిరునామా, గతంలో ఎక్కడ పని చేశారు. కుటుంబ సభ్యుల వివరాలు వంటి సమాచారాన్ని తెలుసుకుని నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుండి జీవనోపాధి కోసం ఈ ప్రాంతానికి వచ్చిన వారు తమ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవనం సాగించాలని, అనవసరమైన అత్యాశలకు పోకుండా చట్టబద్ధంగా పనులు చేసుకోవాలని పోలీసులు సూచించారు. నేరాల నియంత్రణకు ప్రజలందరు పోలీసులకు సహకరించాలన్నారు.

గ్రామంలో, ఎంట్రీ, ఎగ్జిట్ దారులలో, దుకాణాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసుతో సమానమని పేర్కొన్నారు. దొంగతనాలు, ప్రమాదాలు, నేరాలు, గొడవలు జరిగినప్పుడు నిందితులను సీసీ కెమెరాల ద్వారా సులువుగా పట్టుకోవచ్చన్నారు. అలాగే యువత గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చదువుతో పాటు క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాన్నారు. చెడు అలవాట్లకు బానిసలై భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని, ఈ గ్రామంలో ఎవరైనా గంజాయి, మత్తు పదార్థాల వంటి వాటిని విక్రయిస్తే, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడినట్లయితే.. పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

వేసవి నేపథ్యంలో విహార యాత్రలకు, ఊర్లకు వెళ్లే వారు ఇంట్లో విలువైన వస్తువులు, బంగారం, నగలు, డబ్బులను బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలన్నారు. రోడ్డు భద్రత నియమాలు వాహనదారులందరు తప్పనిసరిగా పాటించాలన్నారు. అనంతరం సరైన పత్రాలు వాహనాలను గుర్తించి జరిమానాలను విధించారు. ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే, వారి పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలు కూడా అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాల పై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసిపి ఆర్.ప్రకాష్, రూరల్ సీఐ రవీందర్, ఎస్సై ప్రశాంత్, మంచిర్యాల ఎస్ఐ శ్రావణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply