తిరుపతిపై అంతర్జాతీయ హోటల్ బ్రాండ్ల దృష్టి

తిరుపతిపై అంతర్జాతీయ హోటల్ బ్రాండ్ల దృష్టి
తిరుపతి, ఆంధ్రప్రభ ప్రతినిధి: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. బుధవారం తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన రిజెంటా దేవరాయ ఫోర్ స్టార్ హోటల్ను తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, తిరుమల టిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డిలతో కలసి మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ టూరిజం ప్రధాన భూమిక పోషిస్తోందని కేవలం ఇక్కడికి వచ్చే యాత్రికులు దర్శనాలకే పరిమితం కాకుండా రెండు మూడు రోజులు ఇక్కడే బస చేసి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేలా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. గత 24 నెలల కాలంలో పర్యాటక రంగంలో సుమారు రూ 20 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయులు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తిరుపతి, విశాఖపట్నంలను ఐకానిక్ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయబోతున్నామని, ఇందుకోసం ఒక్కో కేంద్రానికి రూ 500 కోట్ల చొప్పున మొత్తం రూ 1,000 కోట్లు వెచ్చించనున్నట్లు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో 2029 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల హోటల్ గదులు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
పర్యాటకానికి పారిశ్రామిక హోదా: జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతిని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గత రెండేళ్లలో తిరుపతిలో హాస్పిటాలిటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. మ్యారియేట్ ఇంటర్నేషనల్, లెమన్ ట్రీ హోటల్స్, ది ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ వంటి ప్రముఖ హోటల్ బ్రాండ్లు తిరుపతిలో కార్యకలాపాలు ప్రారంభించడం నగర అభివృద్ధికి నిదర్శనమన్నారు. రిజెంటా బై దేవరాయ హోటల్ 56 గదులతో ప్రారంభం కావడం తిరుపతి పర్యాటక రంగంలో మరో మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ ప్రాంతం మొత్తం ఫోర్ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లకు అనుకూలమైన ఎకోసిస్టమ్లో రూపుదిద్దు కుంటోందన్నారు. భక్తుల బస వ్యవధిని రెండు రోజుల వరకు పెంచడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. పర్యాటక రంగాన్ని పరిశ్రమల విభాగంగా గుర్తిస్తూ ప్రత్యేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, విధానాలు అమలు చేస్తున్నామని తెలిపారు. త్వరలో దామినేడులో 21 ఎకరాల విస్తీర్ణంలో భారీ కన్వెన్షన్ కమ్ హోటల్ కాంప్లెక్స్ ఏర్పాటు కానుందని వెల్లడించారు. అదేవిధంగా ది ఓబిరియో గ్రూప్, ఆటమ్రపీ కోర్ తదితర అంతర్జాతీయ హోటల్ బ్రాండ్లు కూడా తిరుపతిలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని తెలిపారు.
తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొస్తున్న పర్యాటక అనుకూల విధానాల వల్ల ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ హోటల్ సంస్థలు తిరుపతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుండటం ఆనందదాయకమని పేర్కొన్నారు. రీజెంటా బై దేవరాయ వంటి నూతన ఫోర్ స్టార్ హోటల్స్ పర్యాటకులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి, టూరిజం ఆర్ డి రమణమూర్తి హోటల్ యాజమాన్య ప్రతినిధులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
