హమాలీల నిర్లక్ష్యంతో రైతులే కూలీలుగా..

హమాలీల నిర్లక్ష్యంతో రైతులే కూలీలుగా..

  • ధాన్యం లోడ్ చేసుకుంటూ అవస్థలు పడుతున్న అన్నదాతలు..
  • చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్..

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: రఘునాథపల్లి మండలం పొట్టిగుబ్బడి తండా గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీల నిర్లక్ష్యం రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. కొనుగోలు కేంద్రంలో ధాన్యానికి కాంటాలు వేసినప్పటికీ, వాటిని ట్రాక్టర్లలో లోడ్ చేసే విషయంలో హమాలీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్లు మళ్లీ మళ్లీ కేంద్రానికి రావడం కష్టమవుతుండటంతో రైతులు తమ తోటి రైతుల సహకారంతో స్వయంగా ధాన్యం బస్తాలను ట్రాక్టర్లలో లోడ్ చేసుకుంటున్నారు. హమాలీలకు డబ్బులు చెల్లించినప్పటికీ వారు విధులు సక్రమంగా నిర్వర్తించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఈ విషయంపై కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న హమాలీలపై, అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నిర్వాహకులపై సంబంధిత అధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు తీసుకుని పని చేయకపోతే రైతులు ఎవరిని ఆశ్రయించాలి అంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply