TG – తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ క్రమ శిక్షణ కమిటీ నోటీస్ ..
హైదరాబాద్ – కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. కుల గణన సర్వేను తప్పుబడుతూ అభ్యంతరకరమైన భాషతో విమర్శలు చేయడం, కుల గణన ఫారంను దగ్ధం చేయడంపై వివరణ ఇవ్వాలంటూ ఈ నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ క్రమ శిక్షణ సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది..
కుల గణన శాస్త్రీయ పద్ధతిలో జరిగింది: మహేశ్ కుమార్ గౌడ్
కుల గణన శాస్త్రీయ పద్ధతిలోనే జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలో 56 శాతానికి పైగా బీసీలు ఉన్నారని ఆయన తెలిపారు. బీసీ సంఘాలను బీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బీసీ సంఘాల నేతలు రాజకీయ నాయకుల ట్రాప్‌లో పడవద్దని విజ్ఞప్తి చేశారు.
పార్టీలో ఎవరైనా సరే గీత దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా గీత దాటితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు. క్రమశిక్షణ తప్పితే ఏం చేయాలో కమిటీ చూసుకుంటుందని ఆయన అన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ సమావేశం ఉందని, అందులో అన్ని అంశాలు మాట్లాడుతామన్నారు.
కుల గణన, ఎస్సీ వర్గీకరణతో బీసీ, ఎస్సీల దశాబ్దాల కల సాకారమైందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గం చొరవతో ఈ రెండు సాధ్యమయ్యాయన్నారు. స్వాతంత్రానంతరం బీసీ కుల గణన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. బీహార్ వంటి రాష్ట్రాలు కుల గణన చేపట్టినా కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. కుల గణనపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడానికి బదులు సూచనలు, సలహాలు ఇస్తే బాగుంటుందన్నారు.