నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలి

నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలి

కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గురువారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులు, రైతు సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, రహదారులు, విద్యుత్, విద్యా సంస్థల మౌలిక వసతులు తదితర అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్‌డీఎఫ్ కింద రూ.5 కోట్లతో నియోజకవర్గ పరిధిలోని రెండు పట్టణాలు, నాలుగు మండలాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను కలెక్టర్‌కు అందజేశారు. మాజీ సర్పంచులకు సంబంధించిన 15వ ఫైనాన్స్ నిధులను వెంటనే గ్రామపంచాయతీలకు సమాన ప్రాధాన్యతతో విడుదల చేయాలని కోరారు.

వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలి
జొన్నలు, మక్కలు, శనిగల కొనుగోళ్లు నిలిచిపోయాయని, వెంటనే కొనుగోలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. వరి ధాన్యం కొనుగోలులో మిల్లర్లు రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, అకాల వర్షాల కారణంగా ధాన్యం దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. గన్నీ బ్యాగుల కొరత, లారీల లభ్యత సమస్యలను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
చేర్లగోపులారం, ముబారక్‌పూర్-ఏ గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని పేర్కొంటూ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ముబారక్‌పూర్-ఏ గ్రామంలో రైతులు పొలాలకు వెళ్లేందుకు మోరం రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఎమ్మెల్యే కోటా కింద 40 శాతం కేటాయింపులు చేయాలని కోరగా, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.రెండు సంవత్సరాలుగా నిలిచిపోయిన సదాశివపేట ఎంపీపీ భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని, సదాశివపేట పట్టణంలో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల భవనానికి స్థలం కేటాయించాలని కోరారు. నర్సింగ్ కాలేజీలో ఫర్నీచర్ ఏర్పాటు చేస్తే వెంటనే వినియోగంలోకి వస్తుందని పేర్కొంటూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.

జాతీయ రహదారి పనులు వేగవంతం చేయాలి
ఎన్‌హెచ్‌ఏఐ రహదారి పనులను వేగవంతం చేయాలని, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో సంగారెడ్డి బైపాస్ వద్ద చేపడుతున్న 80 ఫీట్ల రహదారి పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కోరారు. సంగారెడ్డి పట్టణంలో టీయూఎఫ్‌ఐడీసీ నిధుల విడుదల, రెండు పట్టణాలకు ఎస్‌డీఎఫ్ నిధుల మంజూరు అంశాలపై కూడా చర్చించారు.
మునిదేవునిపల్లి గ్రామ అవసరాల కోసం 20 ఎకరాల భూమి కేటాయించాలని, సదాశివపేట, సంగారెడ్డి, రాజంపేట, పెద్దాపూర్, అరుట్ల ప్రాంతాల్లో సబ్‌స్టేషన్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. 2026-27 సంవత్సరానికి రూ.1.98 కోట్లతో బోర్‌వెల్ పనులకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు.

కంది మండలంలోని చిమ్నాపూర్ గ్రామంలో ఎంపీయూపీఎస్ పాఠశాల భవన నిర్మాణానికి భూమి కేటాయించాలని, సంగారెడ్డి, సదాశివపేట మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

సంగారెడ్డిలో మినీ హజ్ హౌస్ పూర్తి పనులకు అదనపు నిధులు విడుదల చేయాలని, అమృత్ పథకం పనులను వేగవంతం చేయాలని కోరారు. కంది మండలంలో కొత్త ఎంపీపీ భవనానికి రూ.2 కోట్ల మంజూరు రద్దయిన నేపథ్యంలో ఎస్‌డీఎఫ్, టీయూఎఫ్‌ఐడీసీ, ఎంఆర్ఆర్ గ్రాంట్ పనులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.
బేగంపేట్ గ్రామంలో గ్రామకంఠం భూములపై అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, ఇంద్రకరణ్, కంది, అరుట్ల, ఫసల్వాడి ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ కింద రైతులకు కేటాయించాల్సిన 600 గజాల స్థలాల సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు.

సంగారెడ్డి – మదీనగూడ ఎన్‌హెచ్‌ఏఐ రహదారి పనులను వేగవంతం చేయాలని కూడా కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply