ఉద్యమకారుల హామీలపై జూన్ 2 లోపు స్పష్టత ఇవ్వాలి..

ఉద్యమకారుల హామీలపై జూన్ 2 లోపు స్పష్టత ఇవ్వాలి..

తెలంగాణ కోసం పోరాడిన వారిని విస్మరిస్తే కాంగ్రెస్ కు రాజకీయ మూల్యం తప్పదు,
ప్రత్యేక కమిటీ, 250 గజాల ఇంటి స్థలం,
25వేల పెన్షన్ హామీల అమలు డిమాండ్,
జూన్ 2 లోపు ప్రకటన లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాల హెచ్చరిక, – నందగిరి రజినీకాంత్,

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 లోపు ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయడంతో పాటు ప్రత్యేక కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ నందగిరి రజినీకాంత్ డిమాండ్ చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు అనేక కీలక హామీలు ఇచ్చిందని, అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు వాటిపై స్పష్టత ఇవ్వకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తెలంగాణ ఉద్యమకారుల కృషి ఎంతో కీలకమైందని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని, ప్రతి ఉద్యమ
కారునికి 250 గజాల స్థలం కేటాయిస్తామని, ఝార్ఖండ్ తరహాలో నెలకు రూ.25 వేల పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అదేవిధంగా ఉచిత రైలు, బస్సు ప్రయాణ సౌకర్యాలు కల్పించడం, రూ.10 వేల కోట్లతో ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం, ఉద్యమకారులను స్వతంత్ర సమర
యోధులుగా గుర్తించడం వంటి అంశాలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రస్తావించిందని తెలిపారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధికారిక ప్రకటన చేసి ఉద్యమకారులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఉద్యమకారుల ఆశయాలను విస్మరిస్తే గతంలో బి.ఆర్.ఎస్ ప్రభుత్వానికి ఎదురైన ప్రజా వ్యతిరేకతే కాంగ్రెస్ ప్రభుత్వానికీ ఎదురవుతుందని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం కృతజ్ఞతతో వ్యవహరించాలని, వారి గౌరవం మరియు భవిష్యత్తు భద్రత కోసం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని పలువురు ఉద్యమకారులు కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Leave a Reply