చల్లగరిగ వైన్ షాపులో అగ్నిప్రమాదం.. రూ.2 లక్షల ఆస్తి నష్టం

చల్లగరిగ వైన్ షాపులో అగ్నిప్రమాదం.. రూ.2 లక్షల ఆస్తి నష్టం

చిట్యాల, (ఆంధ్రప్రభ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామంలోని ఓ వైన్ షాపులో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు షాప్ నిర్వాహకులు తెలిపారు.

గ్రామ ప్రధాన రహదారి పక్కన ఉన్న వైన్ షాపులో ఒక షట్టర్ ద్వారా విక్రయాలు నిర్వహిస్తుండగా, మరో షట్టర్‌లో బీరు పెట్టెలను నిల్వ ఉంచారు. ఈ క్రమంలో ఆకస్మికంగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు బీరు కార్టన్‌లకు వ్యాపించాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే నిర్వాహకులకు సమాచారం అందించగా, వారు ఘటనాస్థలికి చేరుకుని నీటితో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

అయితే అప్పటికే పలువురు బీరు సీసాలు మంటల వేడికి పగిలిపోవడంతో గణనీయమైన నష్టం వాటిల్లింది. సమయానికి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.