టిడీఆర్‌డీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకస్మిక మృతి

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని పెద్దూర్ గ్రామానికి చెందిన తెలంగాణ దివ్యాంగుల పునరావాస అభివృద్ధి ఆర్గనైజేషన్ (టిడీఆర్‌డీఓ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొట్ల క్రాంతికుమార్ యాదవ్ (42) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు.

వివరాల్లోకి వెళితే.. గత రెండు సంవత్సరాలుగా పెద్దూర్ గ్రామ సమీపంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో కుటుంబంతో కలిసి నివసిస్తున్న క్రాంతికుమార్‌కు ఆదివారం మధ్యాహ్నం ఆకస్మికంగా గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన మృతి చెందారు.

గతంలో కూడా ఆయనకు రెండుసార్లు గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం కోలుకున్నారు. అయితే ఈసారి తీవ్ర గుండెపోటుకు గురై కన్నుమూశారు. టిడీఆర్‌డీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న క్రాంతికుమార్ వికలాంగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారు.

దివ్యాంగుల హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహిస్తూ, వారి సమస్యలను ప్రభుత్వం మరియు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేవారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు దివ్యాంగులకు అందేలా కృషి చేసిన సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. క్రాంతికుమార్ ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Leave a Reply