Snakes | పాములు బాబోయ్ పాములు

Snakes | పాములు బాబోయ్ పాములు
వారం, పది రోజులుగా ఇళ్లల్లోకి వస్తున్న పాములు
కొత్తచెరువు మేదర వీధిలో పాముల దిగులుతో ప్రజలు
పట్టించుకోని సచివాలయ ఉద్యోగులు
Snakes శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai district) పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండల కేంద్రంలోని మేదర వీధిలో పాములు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. వారం, పది రోజులుగా రోజు ఒకటి, రెండు పాములు ఇళ్ళలోకి వస్తూ మేదరి వీధి వాసులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. పాములు (Snakes) పట్టే వ్యక్తి రోజువారిగా మేదరి వీధికి వచ్చి పాములను పట్టుకువెళ్తున్నా.. పాములు వస్తూనే ఉన్నాయని మేదర వీధికి చెందిన మహిళలు వాపోతున్నారు.
పాముల (Snakes) కారణంగా వీధిలోను, రోడ్డుపైన వెళ్లాలంటేనే భయం భయంగా వెళ్లాల్సి వస్తోంది. ఇక రాత్రి సమయంలో ఇళ్లలో ప్రశాంతంగా పడుకోవడానికి వీలు పడడం లేదు. ఎప్పుడు ఏ విధంగా పాములు వస్తాయో అని దిగులుతోనే పడుకోవలసి వస్తోందని మేదర వీధికి చెందిన అమ్మా జాన్ అనే మహిళ అన్నారు. కాగా కదిరి -కొత్తచెరువు రోడ్డులో ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్న మేదర వీధి సందులోకి పాములు ఎలా వస్తున్నాయో? అనేది అంతుచిక్కని ప్రశ్నగా ఉందని వీధి ప్రజలు అంటున్నారు.
సమస్యను సచివాలయం (Secretariat) లో తెలియజేసినప్పటికీ ఎలాంటి స్పందనలేదని తెలిసింది. ఈ విషయంలో సంబంధిత అధికారులు తక్షణం స్పందించి తగిన చర్యలు తీసుకొని ప్రజలు పాముకాటుకు గురి కాకుండా ముందస్తు చర్యలు చేపట్టి, తమకు పాముల నుంచి విముక్తి కలిగించాలని కోరుతున్నారు.
