Scrub typhus cases | అప్రమత్తంగా ఉండాలి
- స్క్రబ్ టైఫస్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
- తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి
Scrub typhus cases | తిరుపతి బ్యూరో, ఆంధ్రప్రభ : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు(Scrub typhus cases) వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, వైద్య శాఖ అత్యంత అప్రమత్తంగా ఉండాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని, జిల్లాల్లో చిత్తూరు ముందంజలో ఉండడం ఆందోళనకు గురిచేస్తోందని ఎంపీ గురుమూర్తి తెలిపారు. తిరుపతి జిల్లాలో కూడా ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి, ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షా సదుపాయాలు, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా వైద్య శాఖ తక్షణం చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు.
చిత్తూరు, తిరుపతి(Chittoor, Tirupati) జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారులకు పిలుపునిచ్చారు. స్క్రబ్ టైఫస్ ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయమయ్యే వ్యాధి కాబట్టి ప్రజలు భయపడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా సమీప ఆసుపత్రిలో వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఎంపీ కోరారు.

