Indiramma Housing Scheme | ఆదివాసీ గూడేల్లో అదనంగా 21 వేల పక్కా ఇళ్లు

Indiramma Housing Scheme | ఆదివాసీ గూడేల్లో అదనంగా 21 వేల పక్కా ఇళ్లు

Indiramma Housing Scheme | తక్కువ ఖర్చుతో వేగంగా ఇళ్ల నిర్మాణం
షేర్‌వాల్ టెక్నాలజీతో నెలరోజుల్లో గృహ నిర్మాణం
లబ్ధిదారులకు భారం తగ్గించే కొత్త విధానం

Indiramma Housing Scheme | ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అడ్డంకులు, అవరోధాలు అధిగమించేలా, తక్కువ వ్యవధిలో నిర్మాణం పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం మలేషియా టెక్నాలజీని వినియోగించనుంది. ఇళ్ల నిర్మాణంలో తడిసి మోపెడవుతున్న ఖర్చు, ఇసుక, ఇటుక రవాణాలో ఇబ్బందులు, ఆదివాసీ గూడేల్లో తలెత్తుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది.

షేర్‌వాల్ టెక్నాలజీగా పిలిచే ఈ విధానం వల్ల 401 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.5 లక్షలకే ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా హౌసింగ్ కార్పొరేషన్ ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రయోగాత్మకంగా కొమురంభీం జిల్లాలో ఈ విధానంతో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి కెరమెరి మండలం కొటారి గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తగూడెం సందర్శించగా, అక్కడ హౌసింగ్ అధికారులు రూపాబాయి అనే పేదింటి మహిళకు నెలరోజుల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం నమూనాను పరిశీలించారు. వర్షాకాలంలో ఇళ్ల నిర్మాణంలో తలెత్తుతున్న జాప్యాన్ని నివారించేలా, రెండో విడత ఇళ్లు సకాలంలో పూర్తిచేసేలా అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.

సెల్ఫ్ కాంపాక్ట్ కాంక్రీట్‌తో గృహ నిర్మాణం

షేర్‌వాల్ సాంకేతిక విధానం ద్వారా సెల్ఫ్ కాంపాక్ట్ కాంక్రీట్‌ (ఎస్సీసీ)తో కాంక్రీట్, సిమెంట్, ఇసుక, స్టీల్‌తో నిర్మించే పద్ధతిని వినియోగిస్తారు. స్లాబ్‌తో పాటు హాల్, బెడ్‌రూమ్, కిచెన్, టాయిలెట్స్, స్నానపు గదులను వేరువేరుగా ఒకేసారి గోడలు నిర్మించేలా మధ్యలో స్టీల్డ్స్‌ను అమరుస్తారు. దానికి ఇరువైపులా అల్యూమినియం ప్యాడ్స్‌ను ఏర్పాటు చేస్తారు. స్లాబ్ నుంచి సిమెంట్, కాంక్రీట్, ఇసుక మిశ్రమాన్ని పోసి గోడలను నిర్మిస్తారు. మిగిలిన గోడలకు కిటికీలు, దర్వాజాలు, మెట్లు, గదులు స్వయంగా మనమే ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఈ విధానం ద్వారా రూ.లక్ష వరకు అదనపు భారం తగ్గనుంది. పైగా ఇంటి నిర్మాణం నాణ్యంగా ఉంటుందని, నెల రోజుల్లోనే పూర్తవుతుందని హౌసింగ్ అధికారులు పేర్కొంటున్నారు.

ఆదివాసీ గూడేల్లో అదనంగా 21 వేల ఇళ్లు

ఇందిరమ్మ గృహాల నిర్మాణంలో ఆదివాసీ గూడేలకు అదనంగా 21 వేల పక్కా గృహాలు నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం రెండో విడతలో జాప్యం లేకుండా సకాలంలో షేర్‌వాల్ పద్ధతిన ఇందిరమ్మ గృహాలు నిర్మించేలా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు మొదటి విడతలో మంజూరైతే, లక్షా 10 వేల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది కాలంలో 16,106 ఇళ్లు మంజూరు కాగా, వీటిలో 2,959 రూఫ్ లెవల్ వరకు పూర్తి కాగా, 3,026 ఇళ్లు స్లాబ్ లెవల్ వరకు పూర్తయ్యాయి. మొత్తం ఇళ్ల నిర్మాణం లక్ష్యంలో కేవలం 1,477 మాత్రమే పూర్తయ్యాయి. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తే లబ్ధిదారులకు మరింత భారం తగ్గడమే కాక, సకాలంలో గృహ ప్రవేశాలు చేసుకునేందుకు వెసులుబాటు కలగనుంది.

Leave a Reply