Road doctor machine | 5–10 నిమిషాల్లో గుంతల మరమ్మతు
Road doctor machine | 5–10 నిమిషాల్లో గుంతల మరమ్మతు
Road doctor machine | రోడ్ డాక్టర్ యంత్రం పనితీరు
గుంతల మరమ్మతుల్లో వేగం మరియు ఖర్చు తగ్గింపు
రాష్ట్రంలో అమలు విస్తరణ ప్రణాళిక
ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం
Road doctor machine | అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం రోడ్లపై గుంతలను అత్యంత వేగంగా, శాశ్వతంగా పూడ్చడానికి ‘రోడ్ డాక్టర్’ అనే అత్యాధునిక యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రత్యేక వాహనాలు కేవలం 45 నుంచి 60 నిమిషాల్లోనే రెండు మీటర్ల పొడవు, ఒక మీటరు వెడల్పు ఉన్న గుంతలను సైతం సులభంగా పూడ్చగలవు.
రోడ్ డాక్టర్ వాహనం పనితీరు పలువురిని ఆకర్షిస్తోంది. ఈ వాహనం రోడ్డుపై గుంతలను గుర్తించిన వెంటనే అక్కడికక్కడే పనిని ప్రారంభిస్తుంది. గుంతను శుభ్రం చేసి, తారు మిశ్రమం (ఎమల్షన్) స్ప్రే చేసి, వేడి తారు–కంకర మిశ్రమాన్ని నింపి, రోలర్‌తో సమానంగా నొక్కుతుంది. ఈ నాలుగు పనులు ఒకే వాహనంలో ఏకకాలంలో పూర్తవుతాయి.
గతంలో మాన్యువల్ పద్ధతిలో గుంతలు పూడ్చడానికి రోజులు పట్టేది. ఈ సాంకేతికతతో సమయం ఆదా అవ్వడమే కాకుండా ఖర్చు కూడా తగ్గుతోంది. పాత పద్ధతిలో రూ. 4 వేలు ఖర్చు అయ్యే పనులు రోడ్ డాక్టర్ యంత్రం ద్వారా రూ. 3 వేలకు పూర్తవుతున్నాయని ఆర్ అండ్ బి అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో తొలిసారిగా తాడేపల్లి–మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని సత్ఫలితాలను బట్టి కాకినాడ, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం వంటి ప్రధాన నగరాలకు విస్తరించారు. ఇప్పటివరకు ఈ ఐదు నగరాల్లో వేలాది గుంతలు పూడ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది కూడా ఇదే టెక్నాలజీని విస్తృతంగా వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది.
5 నుంచి 10 నిమిషాల్లోనే గుంతలకు మోక్షం
చిన్న చిన్న గుంతలు అయితే 5 నుంచి 10 నిమిషాల్లోనే మరమ్మతులు పూర్తవుతాయి. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా వాహనం గుంత వద్దకు వెళ్లి రిపేర్ పూర్తి చేసి ముందుకు కదులుతుంది. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం గణనీయంగా తగ్గుతుంది. ఈ సేవలను రాష్ట్రంలోని మరో 12 నగరాలకు విస్తరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్లపై ఏర్పడే గుంతల సమస్యను ఈ అత్యాధునిక యంత్రాలు త్వరితగతిన పరిష్కరించడం ఆశాజనకమైన, విప్లవాత్మకమైన మార్పుగా నిలుస్తోంది.
