Public Transport Benefits | పట్టణీకరణతో పెరిగిన ట్రాఫిక్‌ సమస్యలు

Public Transport Benefits | పట్టణీకరణతో పెరిగిన ట్రాఫిక్‌ సమస్యలు

Public Transport Benefits | కాలుష్యం వల్ల పెరుగుతున్న అనారోగ్యాలు
ప్రజారవాణా అవసరాన్ని గుర్తించాల్సిన సమయం
ప్రపంచ నగరాల్లో ప్రజారవాణా విజయవంతం
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సవాళ్లు
ప్రజారవాణాతో సమయం, డబ్బు ఆదా
సుస్థిర అభివృద్ధికి ప్రజారవాణా కీలకం

Public Transport Benefits | పూర్వ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ జనాభా వ్యవసాయ ఆధారంగా జీవితాలను గడిపే పరిస్థితి ఉండుట వలన ఆయా గ్రామాల్లో లేదా నివాస ప్రదేశాల్లో దాదాపు జీవితకాలం అంతా అక్కడే ఉండి పరిసమాప్తం అయ్యేది. తదుపరి చదువు అందుబాటులోకి రావడం, పారిశ్రామికీకరణ జరగడంతో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పట్టణ ప్రాంతాలకు జనాభా వలస వెళ్లడం ద్వారా పట్టణీకరణ జరగడం వల్ల పని ప్రదేశానికి, నివాస ప్రదేశానికి దూరం ఎక్కువగా ఉండుట వలన దాదాపు అందరూ వాహనాలు వాడటం మొదలు పెట్టడం జరిగింది. మోటార్‌ సైకిళ్లు, కారులు వ్యక్తిగతంగా కొనడం వలన మొత్తం పట్టణాలు, నగరాలు “ట్రాఫిక్‌ జామ్‌“లో చిక్కుకోవడం తత్‌ ద్వారా పలు సమస్యలకు కారణం అయింది.

ముఖ్యంగా మనదేశంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, కలకత్తా వంటి నగరాల్లో ప్రతీ రోజూ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతాయి. వాయు, ధ్వని కాలుష్యం పెరిగి అనేక శారీరక, మానసిక రోగాలకు కారణం అవుతుంది. హైదరాబాద్‌ నగరంలోనే నేటి వాహన వేగం గంటకు ఇరవై ఐదు కిలోమీటర్ల లోపుగా ఉంటుంది అంటే ఎంత ట్రాఫిక్‌ జామ్‌ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. దీంతో విలువైన సమయం కోల్పోవడం జరుగుతుంది. వాహనదారులు, పట్టణ ప్రాంతపు జనాభా రకరకాల అనారోగ్యాలతో బాధపడుతున్న పరిస్థితి. దీంతో సంపాదన కంటే వైద్య ఖర్చులు తడిపిమోపుడు అవడం వలన ప్రజల ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. దేశాభివృద్ధికి గ్రామాలు ఎంత ముఖ్యమో, పట్టణాలు నగరాలు కూడా అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో టౌన్‌ ప్లానింగ్‌ ప్రముఖ పాత్ర వహించడంతో పాటు ట్రాఫిక్‌ జామ్‌ పెను సవాల్‌గా మారిపోయింది. నగర పాలక సంస్థలకు, పోలీస్‌ వారికి, ప్రభుత్వాలకు ట్రాఫిక్‌ నిర్వహణ ప్రతీ రోజూ ఒక సవాలుగా మారిన పరిస్థితి.

ముఖ్యంగా పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నా, సకాలంలో విధులకు హాజరు కావాలన్నా, పాఠశాలలకు చేరాలన్నా, అనేక అనారోగ్యాల నుంచి బయటపడాలన్నా పరమ దివ్య ఔషధం ప్రజా రవాణా అని ప్రభుత్వాలు, పౌర సమాజం గుర్తెరగాలి. ప్రపంచంలోనే హాంగ్‌కాంగ్‌, సింగపూర్‌, టోక్యో, బెర్లిన్‌, లండన్‌, సియోల్‌, జ్యూరిచ్‌, ప్యారిస్‌, స్టాక్‌హోమ్‌, షాంఘై వంటి నగరాల్లో ప్రజా రవాణా విరివిగా వాడుతూ అత్యంత వేగంగా తమ పనులు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఇక మనదేశంలో కర్ణాటక, ఢిల్లీ, ముంబై, భువనేశ్వర్‌ వంటి ప్రాంతాల్లో ప్రజా రవాణా చక్కగా వినియోగించుకోవడం జరుగుతుంది. అయితే దేశంలో ఉన్న అనేక వేల పట్టణ నగరాలు ప్రజా రవాణా వ్యవస్థను అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో అందుబాటులో ఉండేటట్లు చూడాలి. చార్జీలు కూడా పేద మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే విధంగా ఉండాలి.

ఇటీవల కాలంలో మనం పరిశీలిస్తే ఢిల్లీలో కాలుష్యం వలన అనేక మంది అనారోగ్యాలతో సతమతం అవుతున్నారు. అదే సమయంలో అనేక పట్టణ నగర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీస్‌ వారు అనేక అనారోగ్యాలతో సతమతం అవుతున్న పరిస్థితి. ట్రాఫిక్‌ జామ్‌కు, అనేక కాలుష్యాలకు, అనేక అనారోగ్యాలకు, విధులకు ఆటంకాలకు ప్రధాన కారణం వ్యక్తిగతంగా వాహనాలపై ప్రయాణం చేయడం. మన హైదరాబాద్‌ నగరంలోనే ప్రతీ రోజూ దాదాపు రెండు వేల వాహనాలు నూతనంగా రోడ్డుపైకి రావడం జరుగుతుంది. దీంతో ట్రాఫిక్‌ సమస్యలు, వాయు, ధ్వని కాలుష్యం పెరిగి అనేక సమస్యలు పెరగటం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పై సమస్యల పరిష్కారం కోసం ప్రతీ ఒక్కరూ ప్రజా రవాణాపై దృష్టి సారించాలి. ప్రభుత్వాలు కూడా ప్రజా రవాణా వ్యవస్థ బస్సులు, మెట్రో ట్రైన్‌ వంటి సదుపాయాలు పెంచాలి. ప్రజలను జాగృతి చేయాలి. ప్రజలు కూడా సమయం, డబ్బు ఆదా అవడంతో పాటు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గుతాయని గ్రహించాలి. కాలుష్యం తగ్గి, అనారోగ్యాలు తగ్గుతాయని గ్రహించాలి.

ప్రభుత్వాలు కూడా నూతన రోడ్డు మార్గాలు, అండర్‌గ్రౌండ్‌ పాస్‌ నిర్మాణాలు, ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలు, మెట్రో ట్రైన్‌ మార్గాలు విస్తృతంగా నిర్మించాలి. అవసరమైన చోట రోడ్లు వెడల్పు చేయాలి. ఆక్రమణలు తొలగించాలి. ముఖ్యంగా ఈ-వాహనాలు, చార్జింగ్‌, బ్యాటరీ వాహనాలు విరివిగా వాడేటట్లు చూడాలి. చార్జింగ్‌ స్టేషన్లు ఎక్కువగా అందుబాటులోకి తేవాలి. పట్టణ నగర ప్రాంతాల్లో ప్రజలు తమ జీవితాలను ఆహ్లాదకరంగా, ఆనందంగా గడపాలంటే ముఖ్యంగా వికసిత భారత్‌ సాధనలో సుస్థిర అభివృద్ధి సాధించాలంటే ప్రజా రవాణాయే పరమ ఔషధం అని అందరూ గ్రహించి, ప్రోత్సహించడం ఉత్తమం.

ఐ. ప్రసాదరావు
6305682733

Leave a Reply