కలెక్టర్‌ను కలవనీయలేదంటూ..

  • ఇందిరమ్మ లబ్ధిదారుడిని అడ్డుకున్న పోలీసులు
  • కలెక్టర్‌ను కలవనీయలేదని ఆవేదన
  • ఇల్లు కోసం కలెక్టర్‌కు మొర

పెంట్లవెల్లి, ఆంధ్రప్రభ : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను సందర్శించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్‌ను కలిసేందుకు ప్రయత్నించిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడిని పోలీసులు అడ్డుకున్న ఘటన సోమవారం పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో చోటుచేసుకుంది.

పాఠశాల పనులను కలెక్టర్ పరిశీలిస్తున్న సమయంలో స్థానిక లబ్ధిదారుడు కటికే నారాయణ ఒక్కసారిగా ఆయన వద్దకు వెళ్లి, తనకు ఇప్పటికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని, తన సమస్యను వినాలని కోరుతూ కలెక్టర్ కాళ్లపై పడేందుకు ప్రయత్నించాడు.

అయితే అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే స్పందించి నారాయణను కలెక్టర్‌తో మాట్లాడకుండా అడ్డుకుని అక్కడి నుంచి పక్కకు పంపించారు. దీంతో తన సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం లేకుండా పోయిందని నారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు.

“ప్రజా సమస్యలు చెప్పుకుందామంటే కలెక్టర్ దగ్గరకు కూడా రానివ్వడం లేదు. మరి మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి?” అని ప్రశ్నించాడు. ఈ సందర్భంగా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ స్పందిస్తూ, వ్యక్తిగత సమస్యలను ప్రజావాణి కార్యక్రమంలో వినిపించాలని సూచించారు.