“నా గమ్యం ఐఏఎస్” పుస్తక రచయితకు సన్మానం..

బెజ్జంకి, ఆంధ్రప్రభ : భారతరత్న మాజీ ప్రధానమంత్రి శ్రీ పీవీ నరసింహారావు 105వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో “నా గమ్యం ఐఏఎస్” పుస్తక రచయిత శ్రీ నా రోజు శంకరాచారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పీవీ చారిటబుల్ ట్రస్ట్ సీఈవో డాక్టర్ ఎన్.వి. సుధాకిరణ్ మాట్లాడుతూ, తెలుగు భాషలో సివిల్ సర్వీసుల సాధనకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందించే విధంగా ఈ పుస్తకాన్ని రచించడం విశేషమని కొనియాడారు. ఉభయ తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఉపయోగపడేలా సివిల్స్ సిద్ధత, అధ్యయన విధానం, చదవాల్సిన పుస్తకాలు వంటి అనేక ముఖ్యాంశాలను స్పష్టంగా వివరించారని పేర్కొన్నారు.

తెలుగు భాషలో పూర్తిస్థాయిలో రూపొందించిన ఈ పుస్తకం విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తుందని, దీన్ని చదివి అర్థం చేసుకొని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని సూచించారు. తెలుగు ప్రజలందరికీ గర్వకారణమైన ఈ కృషిని అభినందిస్తూ, పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా రచయితను సత్కరించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పుస్తక ఆవిష్కరణతో పాటు పలువురు విద్యావేత్తలు, మేధావులు పాల్గొని రచయితకు అభినందనలు తెలిపారు. పీవీ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు, హైకోర్టు అడ్వకేట్ ఎడపల్లి హరీష్, అపర్ణ ఫౌండేషన్ చైర్మన్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.