AP Assembly | వైసీపీ తీరును ఎండ‌గ‌ట్టిన ప‌వ‌న్ – ఆ పార్టీకీ అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హ‌త లేద‌ని వ్యాఖ్య

వెల‌గ‌పూడి : గ‌వ‌ర్న‌ర్ ను అవ‌మానించిన పార్టీకి అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హ‌త లేద‌ని జ‌న‌సేనాని, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై నేడు అసెంబ్లీలో మాట్లాడుతూ… నిన్న వైసిపి ప్ర‌వ‌ర్తించిన తీరును ఆయ‌న ఎండ‌గ‌ట్టారు.. వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నా గవర్నర్ నిన్న విజయవంతంగా ప్రసంగం పూర్తి చేశారని తెలిపారు. ఎన్డీఏ సభ్యులు 164 మంది చాలా బాధ్యతతో ఉన్నారు.. వైసీపీ నేతల తీరుపట్ల తమ తప్పు లేకున్నా గవర్నర్ కు తామంతా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. గొడవలకు, బూతులకు వైసీపీ పర్యాయపదం అని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు.

ఇంతకాలం వారిని తట్టుకుని నిలబడినందుకు సీఎం చంద్రబాబుకు ఎన్నో గట్స్ ఉన్నాయి.. నిన్న నాకు వైసీపీ వైఖరి చూసి వివేకా హత్య, ప్రజావేదిక కూల్చివేత, ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ జడ్జీలపై పెట్టిన కామెంట్లు.. దాడులు గుర్తొచ్చాయని తెలిపారు. అలాగే.. చంద్రబాబును జైల్లో పెట్టిన విధానం గుర్తొచ్చిందని పేర్కొన్నారు. జ‌గ‌న్ అయిదేండ్ల విధ్వంస కాండ‌ను ఎదుర్కొని నిలిచిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకి సెల్యూట్ చేస్తున్నాన‌న్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వంకు వచ్చిన కష్టమేమీలేదని, రానున్న 15 ఏళ్లు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుందంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. ఏపీలో ప్రతిపక్షం అనేది లేదని, ప్రజలు అందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తామని చెప్పుకొచ్చారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే తమ లక్ష్యమని, ఏపీ ప్రజల పక్షాన ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం ఉంటుందన్నారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గవర్నర్ కు విలువ ఇవ్వని పార్టీకి అసెంబ్లీలోకి వచ్చే అర్హత లేదన్నారు. వైసీపీ సభ్యులు కావాలనే రాద్దాంతం చేసి గవర్నర్ ప్రసంగ ప్రతులను చించివేశారని ఆరోపించారు. వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులకు చక్కని నిదర్శనమే వారికి వచ్చిన 11 సీట్లు అంటూ పవన్ కళ్యాణ్ మరో మారు అసెంబ్లీలో వైసీపీ లక్ష్యంగా విమర్శలు చేశారు.

కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుందని, రాష్ట్ర ప్రజల కోసం కూటమి ప్రభుత్వం చేయాల్సిన ప్రతి పనిని పూర్తి చేస్తుందన్నారు. సీఎం నారా చంద్రబాబునాయుడు సారథ్యంలో ప్రతి పథకం అమలవుతుందని, రాష్ట్ర ప్రజలకు పవన్ భరోసానిచ్చారు. చిన్నచిన్న కుటుంబాలలోనే ఎన్నో సమస్యలు ఉంటాయని, కూటమిలో ఉన్న సమస్యలను తాము కూర్చొని చర్చించుకుంటామ‌న్నారు. సంకీర్ణ ప్రభుత్వం అంటేనే ఒక ఛాలెంజ్ అంటూ ప్రసంగించిన పవన్.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్డీఏ కూటమి కలిసి ఉంటుందంటూ తేల్చి చెప్పారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటామని, విలువలతో కూడిన రాజకీయాలు చేసేందుకు కూటమి ఎప్పుడు ముందుంటుందన్నారు.

గ‌త ప్ర‌భుత్వ నిర్వాకంతో రాజధాని నిర్మించుకోలేని పరిస్థితిలో రాష్ట్రం తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళింద‌న్నారు. సామాజిక ఆర్ధిక అభివృద్ధి సాధించే దిశ‌గా కూట‌మి ప్ర‌భుత్వం న‌ప‌య‌నిస్తున్న‌ద‌ని తెలిపారు. కొంత కాలంగా రాష్ట్రంలో ఆర్ధిక సుస్థిరత లేదని చెప్పారు. రాష్ట్రంలో కులగణనతో పాటు స్కిల్ గణన కూడా జరగాలని కోరుకుంటున్నామ‌న్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు కూడా జరిగిందని అన్నారు. మరోవైపు.. సామాన్యులకు వైద్య ఖర్చులు భారం కాకూడదని రూ.25 లక్షల బీమా సౌకర్యం కల్పించామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలు ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళామ‌ని అంటూ కేంద్రం నుంచి త‌మ‌కు సంపూర్ణ స‌హ‌కారం అందుతున్న‌ద‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు…. ఆంధ్రప్రదేశ్‌లో కులాల ప్రస్తావన తప్పా, ఆంధ్రులు అనే భావన లేదని అంటూ ఒక్క విశాఖ ఉక్కు విషయంలోనే ఆంధ్రులు అనే భావన వచ్చిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందుకు ఇంగ్లీషు, హిందీలో ప్రధాని మోడీకి పవన్ ధన్యవాదాలు తెలిపారు. ఇక అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష పాత్ర తామే పోషిస్తామని తెలిపారు. కూటమి సభ్యుల్లో విభేదాలు ఉండచ్చు.. అందరూ కలిస్తేనే అభివృద్ధి అని పేర్కొన్నారు. మనం బలంగా ఉంటేనే బ్యూరోక్రసి బలంగా ఉంటుందని చెప్పారు. 15 ఏళ్ల పాటు కూట‌మి ప్ర‌భుత్వ‌మే అధికారంలో ఉంటుంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *