గోదావరిఖనిలో హోరెత్తిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ

త్రివర్ణ పతాకాలతో దేశభక్తిని చాటిన మగువ లయన్స్‌ సభ్యులు

గోదావరిఖని, ఆంధ్రప్రభ: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం సందడిగా సాగింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేపట్టిన త్రివర్ణ పతాకాల ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. రామగుండం లయన్స్‌ క్లబ్‌ అనుబంధ మగువ లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షురాలు అంబటి అర్చన సంతోష్‌రావు ఆధ్వర్యంలో వందలాది మంది సభ్యులు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని రెండు కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు.

స్థానిక యూనివర్సిటీ పీజీ కళాశాల నుంచి గోదావరిఖని ప్రధాన చౌరస్తా వరకు హర్‌ ఘర్‌ తిరంగా ప్రదర్శన అట్టహాసంగా సాగింది. ర్యాలీ సందర్భంగా మహిళలు వందేమాతరం నినాదాలతో నగరాన్ని మార్మోగించారు. దారిపొడవునా దేశభక్తి గేయాలతో పాటు సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. చౌరస్తా వద్ద నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో పట్టణ సీఐ ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ సీఐ రాజేశ్వరరావు, అంబటి అర్చన సంతోష్‌రావు, సోమారపు లావణ్య, భవాని, స్వరూప, శశికళ, గాలి సునీత, వొల్లాల సురేష్‌, ఎర్ర కొమురయ్య, మహేందర్‌, కందుల సంధ్యారాణి, అబ్దుల్‌ షకీల్‌తో పాటు లయన్స్‌ క్లబ్‌ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.