ప్రయాణ సమయంలో హెల్మెట్ ధారణ తప్పనిసరి…

ప్రయాణ సమయంలో హెల్మెట్ ధారణ తప్పనిసరి…

కాశీబుగ్గ డీఎస్పీ టి భవాని.
కాశీబుగ్గలో హెల్మెట్ ధారణపై అవగాహన ర్యాలీ..
అభయం హెల్మెట్ బ్యాంక్ కార్యక్రమం..

పలాస, జిల్లా ఆంధ్రప్రభభ : హెల్మెట్ బ్యాంక్ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం కాశీబుగ్గ పట్టణంలో అభయం హెల్మెట్ ర్యాలీ నిర్వహించబడింది. కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని మూడు రోడ్లు కూడలి వద్ద అభయం హెల్మెట్ బ్యాంక్ ప్రారంభించి వాహనదారులకు హెల్మెట్లు అందజేశారు. ఈ ర్యాలీ కాశీబుగ్గ పట్టణంలోని మూడు రోడ్లు కూడలి నుండి ప్రారంభమై కె టి రోడ్డు మీదుగా ఇంద్ర చౌక్ వరకు సాగింది.

అనంతరం అక్కడి నుండి మూడురోడ్లు కూడలి వరకు తిరిగి ర్యాలీ నిర్వహించి ప్రజల్లో హెల్మెట్ ,రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ టి. భవాని, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది స్వయంగా హెల్మెట్ ధరించి వాహనం నడుపుతూ హెల్మెట్ ప్రాముఖ్యత, అవసరం ప్రయోజనాలను ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీగా సాగారు. అలాగే మూడురోడ్లు కూడలిలో ఏర్పాటు చేసిన హెల్మెట్ బ్యాంక్ ద్వారా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు తాత్కాలికంగా హెల్మెట్లు అందజేసి, హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణ రక్షణ ఎంత ముఖ్యమో తెలియజేశారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే ప్రధాన ఉద్దేశంతో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి అభయం హెల్మెట్ బ్యాంక్ కార్యక్రమాన్ని శ్రీకాకుళం పట్టణంలో తోలి దశగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కాశీబుగ్గ–పలాస పట్టణంలో అభయం హెల్మెట్ ర్యాలీ నిర్వహించిన్నట్లు వెల్లడించారు.రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుంది.

ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలి. ఇది కేవలం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాకుండా, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అత్యవసర చర్య అని తెలిపారు. ప్రజలంతా హెల్మెట్ ధారణను అలవాటు చేసుకుని, రోడ్డు భద్రతకు సహకరించాలని పోలీసు అధికారులు సూచించారు. ఈ అవగాహన ర్యాలీలో కాశీబుగ్గ టౌన్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ వై రామకృష్ణ, కాశీబుగ్గ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతి రావు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.