రజనీపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు

రజనీపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్‌: తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు దిగ్గజాలు, దశాబ్దాల కాలంగా ప్రాణ స్నేహితులైన సూపర్‌స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ మధ్య ఉన్న అనుబంధం ఎంత బలమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల రజనీకాంత్ చేసిన కొన్ని సరదా వ్యాఖ్యలపై కమల్ హాసన్ తాజాగా ఎంతో హుందాగా స్పందించారు. “మా మధ్య వెండితెరపై ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది.. కానీ అసూయ ఎందుకు ఉంటుంది?” అంటూ కమల్ హాసన్ తమ మధ్య ఉన్న ప్రత్యేక బంధాన్ని మరోసారి చాటిచెప్పారు.

ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల ఫలితాలు, రాజకీయ పరిణామాలపై సూపర్‌స్టార్ రజనీకాంత్ మీడియా సమావేశంలో మాట్లాడారు. నటుడు విజయ్ విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడంపై స్పందిస్తూ.. విజయ్‌కు తనకు మధ్య వయస్సులో, కెరీర్‌లో చాలా వ్యత్యాసం ఉందని, అందువల్ల తమ మధ్య పోటీ లేదా అసూయ వంటివి రావడానికి ఆస్కారమే లేదని చెప్పారు. ఇదే క్రమంలో రజనీకాంత్ నవ్వుతూ.. “ఒకవేళ నా సమకాలీనుడైన కమల్ హాసన్ సీఎం అయ్యుంటే, బహుశా నాకు కొంచెం అసూయ కలిగి ఉండేదేమో!” అని చమత్కరించారు.

రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై కమల్ హాసన్ స్పందిస్తూ వారి స్నేహాన్ని కొనియాడారు. తామిద్దరం సినిమాల్లో ఎవరి శైలిలో వారు రాణిస్తూ బాక్సాఫీస్ వద్ద పోటీపడతామే తప్ప, తమ మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి అసూయలు లేవని స్పష్టం చేశారు. కెరీర్ ప్రారంభం నుండి ఇద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేశామని, ఆ తర్వాత విడివిడిగా అగ్ర స్థానాలకు చేరుకున్నా తమ మధ్య ఉన్న స్నేహం ఎప్పుడూ చెక్కుచెదరలేదని గుర్తుచేశారు.

Leave a Reply