Mohini Avatar | పల్లకీ సేవలో భక్తులకు దివ్య దర్శనం

Mohini Avatar | పల్లకీ సేవలో భక్తులకు దివ్య దర్శనం
- గోవింద నామస్మరణతో మార్మోగిన నారాయణవనం
- నేడు రాత్రి గరుడవాహన సేవ వైభవం
Mohini Avatar | తిరుపతి, ఆంధ్రప్రభ : నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సోమవారం ఉదయం స్వామివారు మోహినీ అలంకారంలో పల్లకిపై విహరించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు.

ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పల్లకీ సేవలో స్వామివారు గ్రామ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో గోవింద నామస్మరణ చేస్తూ సాగగా, మంగళవాయిద్యాల నడుమ పల్లకీ సేవ అత్యంత వైభవంగా జరిగింది.

అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని ఆధ్యాత్మిక పరవశానికి లోనయ్యారు. గోవింద నామస్మరణతో నారాయణవనం గ్రామం మార్మోగిపోయింది.

పురాణాల ప్రకారం అసురులను మోహింపజేసి దేవతలకు అమృతాన్ని అందించేందుకు శ్రీమహావిష్ణువు మోహినీ అవతారాన్ని ధరించినట్లు చెబుతారు. అదే భావాన్ని ప్రతిబింబించేలా స్వామివారు మోహినీ అలంకారంలో దర్శనమివ్వడంతో భక్తులు విశేష భక్తిశ్రద్ధలతో సేవలో పాల్గొన్నారు.


Mohini Avatar | నేడు గరుడవాహన సేవ
బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడవాహన సేవ సోమవారం రాత్రి 7 గంటల నుంచి నిర్వహించనున్నారు. గరుడునిపై కొలువుదీరనున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
