ప్రతీ ఒక్కరికీ సొంతిల్లు లక్ష్యం

ప్రతీ ఒక్కరికీ సొంతిల్లు లక్ష్యం
- ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్
పెడన, ఆంధ్రప్రభ : ప్రతీ ఒక్కరికీ సొంతిల్లు కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. సోమవారం 9వ వార్డులోని మొగ్గయ్య కాలనీలో గృహ నిర్మాణ శాఖ సహకారంతో గుత్తి పైడమ్మ నూతనంగా నిర్మించిన ఇంటికి టీడీపీ నాయకులతో కలిసి ఆయన గృహప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో విడతగా రెండున్నర లక్షల లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ చేపడుతోందని అన్నారు.
పెడన పట్టణంలో 105 మందికి గాను 55 మంది ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారని, మిగిలిన వారు కూడా త్వరగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వం రూ.1.80 లక్షలు అందించగా, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలను తీసుకువచ్చి ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు.
అలాగే రాష్ట్ర రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటోందని, ఇందుకు సంబంధించిన కీలక నిర్ణయాలను ఇటీవల తీసుకున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేసి స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ, పట్టణంలో 97 మందికి గాను 55 ఇళ్లు పూర్తయ్యాయని అన్నారు.
ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యక్కల శ్యామలయ్య, కమ్మగంటి వెంకటేశ్వరరావు, భట్ట శంకరరావు ప్రసంగించారు. అలాగే టీడీపీ నాయకులు వాహబ్ ఖాన్, పరసా జితేంద్ర, గఫార్ ఖదీర్, మట్టా శివపావని తదితరులు పాల్గొన్నారు.
